
‘పత్రికొక్కటున్న పదివేల సైన్యంబు’ అన్నట్లు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రత్యక్ష పోరాటం ఒక్కటే సరిపోదని భావించిన వీహెచ్దేశాయి.. ఓ పత్రిక స్థాపించాలనుకున్నారు. ‘ది జై తెలంగాణ’ పత్రికను నెలకొల్పారు. ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో వచ్చే ఈ వారపత్రికలు తెలంగాణ ప్రాంత ప్రజలను చైతన్యం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన పోలీసు కాల్పులు, చనిపోయిన తెలంగాణ బిడ్డల లెక్కలను తేదీ, ప్రాంతం, అధికారిక, అనధికారిక లెక్కలతో సహా ప్రచురించారు. అమరవీరుల ఫొటోలను ప్రచురించారు. తెలంగాణ ప్రజా సమితి చైర్మన్‌గా మర్రి చెన్నారెడ్డి ఇచ్చిన పిలుపు, సందేశాలను ప్రజలకు చేరవేయడంలో ఆనాడు జై తెలంగాణ కీలకంగా దోహదం చేసింది. కాసు బ్రహ్మానందారెడ్డి లాంటి ఆంధ్రా పాలకులు కేంద్రంలో కాంగ్రెస్అధిష్టానం వద్ద చేసే లాబీయింగ్‌లు, ఎత్తుగడలను తెలంగాణ ప్రాంత నేతలతోపాటు ప్రజలకు ఎప్పటికప్పుడు దేశాయి తన పత్రిక ద్వారా చేరవేసేవారు. ‘‘Telangana is our birth right and we shall have it”అని 1970 జనవరి 26నే దేశాయి జై తెలంగాణ పత్రికలో పెద్ద వ్యాసం రాశారు.
తెలంగాణలో తిరుగుబాటు ఎందుకు? తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? లాంటి ఆర్టికల్స్సీరియల్స్గా రాశారు. తెలంగాణ ప్రాంత నాయకులు ఢిల్లీ అధిష్టానానికి తెలంగాణ పరిస్థితిని చెప్పేందుకు జై తెలంగాణ పత్రిక క్లిప్పింగ్స్ఎంతో ఉపయోగపడ్డాయి. తెలంగాణ ప్రాంత అగ్ర నాయకులందరూ జై తెలంగాణలో ఉద్యమం గురించిన వ్యాసాలు రాశారు. తెలంగాణకు ప్రధానమంత్రి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని గడ్డం వెంకటస్వామి, ఆంధ్రప్రదేశ్అవతరణ వ్యతిరేక దినోత్సవం జరపడం గొప్ప విజయం అని మర్రి చెన్నారెడ్డి, తెలంగాణకు న్యాయం జరిగి తీరాల్సిందేనని కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రత్యేక రాష్ట్రం కోరడం నేరమేమీ కాదని ఈవీ పద్మనాభన్లాంటి వారు విస్తృతంగా వ్యాసాలు రాశారు. ఏ మదన్ మోహన్, టీఎన్ సదాలక్ష్మి, సంజీవయ్య లాంటి వారు జై తెలంగాణను వేదికగా చేసుకొని ప్రజలను చైతన్యం చేశారు. అదే సమయంలో జై ఆంధ్రా ఉద్యమం ఎందుకు పుట్టింది, కాకినాడ విద్యార్థుల నిరసనలను, వాటి వెనుక గల నేతల ఉద్దేశాలను జై తెలంగాణ ద్వారా దేశాయి ప్రజలకు వివరించగలిగారు.
– కాశెట్టి కరుణాకర్, వెలుగు ప్రతినిధి