హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావును సస్పెండ్ చెయ్యాలె: VHP

ఏసుక్రీస్తు వల్లనే కరోనా మహమ్మారి అంతమైందన్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యాఖ్యలను.. విశ్వహిందూ పరిషత్ తెలంగాణ శాఖ తీవ్రంగా ఖండించింది. ఏసుక్రీస్తు వల్లనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఆయన మాట్లాడటం ముమ్మాటికి తగదని విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది. ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తి మతాలను ప్రేరేపించే విధంగా.. కిందిస్థాయి ఉద్యోగులను ప్రభావితం చేసే విధంగా.. హిందువులను కించపరిచే స్థాయిలో మాట్లాడటం తగదని హెచ్చరించింది.

కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ సెలబ్రేషన్ లో శ్రీనివాసరావు మాట్లాడిన వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ నేతలు తప్పుబట్టారు. మానవజాతికి ఏసుక్రీస్తు మాత్రమే దైవమని.. మిగతా దేవుళ్ళందరూ గ్రాఫిక్స్ అని కించపరిచే మాటలు మాట్లాడటాన్ని ప్రతి హిందువు తీవ్రంగా తప్పుబడుతున్నారన్నారు. యేసుక్రీస్తు వల్లనే భారతదేశం అభివృద్ధి సాధిస్తుందని మాట్లాడటంలో అసలు అర్థం ఉందా అని నిలదీశారు. ఏసుక్రీస్తుకు సంబంధం ఏమిటని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లక్షల మంది వైద్యులు.. కోట్ల మంది వైద్య సిబ్బంది.. శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమిస్తేగాని కరోనా అదుపులోకి రాలేదన్న విషయాన్ని శ్రీనివాసరావు విస్మరించడం ఆయన బుద్ధిలేనితనానికి నిదర్శనం అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు జగిత్యాల జిల్లా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ చౌరస్తా‭లో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. శ్రీనివాసరావు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో హిందూ సంఘాలు ఐక్యమై ఉద్యమిస్తామని హెచ్చరించారు.