
బషీర్‌బాగ్/అంబర్‌పేట్, వెలుగు : శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన శోభాయాత్రలు కనులపండువగా సాగాయి. జైశ్రీరామ్నినాదాలతో భాగ్యనగరం మార్మోగింది. భాగ్యనగర్శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సుమారు 5 కిలోమీటర్ల మేర శోభాయాత్ర నిర్వహించగా, గోషామహల్ఎమ్మెల్యే రాజాసింగ్ఆధ్వర్యంలో మరో శోభాయాత్ర 4 కిలోమీటర్లు సాగింది. అలాగే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంకో శోభాయాత్ర నిర్వహించారు.
హాజరైన గవర్నర్..
భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సీతారాంబాగ్ ఆలయం వద్ద సీతారాముల కల్యాణ మహోత్సవం కనులపండువగా నిర్వహించారు. దీనికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరై శోభాయాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర సీతారాంబాగ్, మంగళ్‌హట్, ధూల్‌పేట, పురానాపూల్, జుమ్మేరాత్‌బజార్, బేగంబజార్, ఛత్రి, సిద్దంబర్‌బజార్, గౌలిగూడ, పుత్లిబౌలి మీదుగా కోఠిలోని ఆంధ్రాబ్యాంక్‌చౌరస్తా వరకు సాగింది.
గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ మాట్లాడుతూ.. శ్రీరాముడు ధర్మస్థాపనకు మార్గదర్శకుడని, ఆయన చూపిన మార్గంలో నడిచి సమాజం, దేశం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. కాగా, ఆనంద్ సింగ్ ధూల్పేటనుంచి సీతారాముల పల్లకి యాత్ర ఏర్పాటు చేయగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై ప్రారంభించారు.
రాజాసింగ్ ఆధ్వర్యంలో..
గోషామహల్ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్ర ఆదివారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఇందులో వేలాది మంది రామభక్తులు పాల్గొన్నారు. రాజాసింగ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ధూల్పేట్ఆకాశపురి హనుమాన్ దేవాలయం వద్ద యజ్ఞం నిర్వహించి, హనుమాన్ చాలీసా పఠనం చేసి శోభాయాత్ర ప్రారంభించారు. ఈ యాత్రకు పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు.
ఈ యాత్ర ధూల్పేట్జాలి హనుమాన్ మందిర్, పురానాపూల్, జుమ్మేరాత్ బజార్, చుడీ బజార్, బేగంబజార్ ఛత్రి, సిద్దంబర్ బజార్ మీదుగా హనుమాన్వ్యాయామశాల వరకు సాగింది. రాజాసింగ్ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం వక్ఫ్ బిల్లు తెస్తే ఒవైసీ బ్రదర్స్ గగ్గోలు పెడుతున్నారని, వారికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. వక్ఫ్ బోర్డ్ రాకముందు 4వేల ఎకరాల భూములుండగా, బోర్డును అడ్డం పెట్టుకొని 9 లక్షల 50 వేల ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు.
కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ..
అంబర్‌పేట శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బాగ్అంబర్పేట్లోని శ్రీరాముడి ఆలయం నుంచి నిర్వహించిన శోభాయాత్రను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ యాత్ర కాచిగూడలోని వీర సావర్కర్ విగ్రహం వరకు కొనసాగింది. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. అయోధ్యలో రామమందిర నిర్మాణం తరువాత భక్తుల్లో మరింత పట్టుదల, భక్తిశ్రద్ధలు పెరిగాయని తెలిపారు. రానున్న రోజుల్లో హిందువుల్లో ఐక్యత మరింత పెరుగుతుందన్నారు.