దుబ్బాక దెబ్బ.. గ్రేటర్లో ప్రకంపనలు

దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా హోరాహోరీ ప్రచారం, చెలరేగిన అలజడి, ఎలక్షన్​ రిజల్ట్.. ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ కనిపించిన ఆశ్చర్యకర పరిణామాలను గేమ్ చేంజర్ అందామా? లేక ఫ్లాష్ ఇన్ ది పాన్ అందామా? రూలింగ్ పార్టీ వాళ్లు.. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లను విమర్శించడం, పోలీసు యంత్రాంగాన్ని ఇష్టమొచ్చినట్టు వాడుకోవడం వల్ల ప్రజల్లో కలిగిన ఆపోజిట్ రియాక్షన్, సానుభూతి బీజేపీకి ప్లస్​ అయ్యాయి. దుబ్బాక ఫలితం వచ్చే గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల్లోనూ ఎఫెక్ట్​ చూపిస్తుంది.

పక్కనే ఉన్న గజ్వేల్, సిద్ధిపేటను బాగా డెవలప్ చేశాం.. దుబ్బాకను కూడా డెవలప్​ చేద్దామని రూలింగ్​ పార్టీ అనుకుని ఉంటే రిజల్ట్ వేరేగా ఉండేదేమో. కానీ, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న దుబ్బాకను ఈ ఆరేండ్లుగా పట్టించుకున్న నాథుడే లేడు. అసలు అక్కడ ఎమ్మెల్యే ఎవరని అడిగితే చాలామంది చెప్పలేని పరిస్థితి. దుబ్బాకలోనే మల్లన్నసాగర్ ఉంది. దుబ్బాకలోని ఎన్నో మండలాల్లోని ఊర్లు మల్లన్నసాగర్  లో మునిగిపోతాయి. ఈ గ్రామాల నిర్వాసితులను ఆరేండ్లుగా ఎవరూ చేరదీయలేదు. మంచి చెడ్డల గురించి ఆరా తీయలేదు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగానీ, ఏ అధికార పార్టీ నాయకుడుగానీ వారిని పలకరించలేదు. దీంతో నిర్వాసితులే కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. దుబ్బాకలో ప్రజలను పట్టించుకునే వారు లేకపోవడంతో ఒక రకమైన ‘యాంటీ -ఇంకంబెన్సీ’, ‘యాంటీ ఎస్టాబ్లిష్​మెంట్’ క్రియేట్ అయి, అసలు ఎమ్మెల్యే చనిపోయారనే సానుభూతి కూడా అక్కడ లేకుండా పోయింది.

దుబ్బాకలో గెలిచిన డెమోక్రసీ

దుబ్బాకలో డెమోక్రసీ గెలిచిందని చెప్పుకోవాలి. ఇది, త్వరలో వస్తున్న జీహెచ్​ఎంసీ ఎలక్షన్స్ లో కూడా స్పష్టం కానుంది. ఎందుకంటే రూలింగ్​ పార్టీ ఇచ్చిన హామీలు, చేసిన పనులకు పొంతన లేకుండా పోయింది. ఆరేండ్ల తర్వాత దుబ్బాక ప్రజలు బయటకు వచ్చి మాకు జరిగింది, ఒరిగింది ఏమీ లేదు. మేము ఒక కొత్త ఆశతో ఓటు వేస్తాం, మమ్మల్ని మేం కాపాడుకుంటాం, ప్రజాస్వామ్యానికి ఓటు వేస్తాం, డెవలప్​మెంట్​కు ఓటు వేస్తాం అని డిసైడ్​ చేసుకుని అందుకు తగినట్టుగానే ఓటు వేశారు. అటువంటి ఆలోచన తెలంగాణలో ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఉందా? పని చేసిన వాళ్లకు అనుభవం ఉన్న వాళ్లకు దుబ్బాక ప్రజానీకం ఓటు వేసింది. ఎలాంటి డెవలప్​మెంట్ చేయకుండా, మళ్లీ మళ్లీ రూలింగ్ పార్టీ వాళ్లకే కళ్లు మూసుకుని ఓట్లేస్తారనుకుంటే అంతకంటే అజ్ఞానం ఉండదు.

ధైర్యంగా నిలబడిన మీడియా

దుబ్బాక బై ఎలక్షన్​లో మీడియా కూడా భయం లేకుండా వేగంగా యాక్షన్​ తీసుకుంది. ప్రింట్ అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా మన రాష్ట్రంలో అంతా సస్యశ్యామలంగా ఉన్నట్టు చూపకుండా వాస్తవాలను ప్రజల ముందు ఉంచాయి. దుబ్బాక ఉప ఎన్నికలో ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా చాలా ప్రభావం చూపించాయనే చెప్పాలి. ఎందుకంటే ఎలక్షన్​ లో రూలింగ్ పార్టీ అనే భయం లేకుండా మీడియా నిష్పక్షపాతంగా రిపోర్టింగ్ చేసింది. రూలింగ్ పార్టీ ఏం చెబుతుందో, మీడియా ఏం చెప్పిందో అన్నీ బేరీజు వేసుకుని పెద్ద సంఖ్యలో పోలింగ్​ బూత్​లకు తరలివచ్చిన దుబ్బాక ప్రజలు తమకు నచ్చిన వారికే ఓటేశారు.

ఏడాదిన్నరలోనే ఎంత మార్పు

జనరల్ ఎలక్షన్స్ జరిగిన ఏడాదిన్నరలోనే ఇంత చేంజ్ రావడం, రూలింగ్ పార్టీ క్యాండిడేట్ ఓడిపోవడంతో అందరిలోనూ ఈ ఎలక్షన్ ముందు తరానికి మరో దారి చూపించనుందా? అనే ప్రశ్న మొదలైంది. నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఎన్నికల ప్రచారాలు, రాజకీయ విమర్శలు ఒక దశలో తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రూలింగ్ పార్టీ వాళ్లు గెలిచేందుకు ఎన్నో ఎత్తులు వేశారు. పోలీసు యంత్రాంగాన్ని ఇష్టమొచ్చినట్టు వాడుకుని ఎన్నో కేసులు పెట్టారు. డబ్బులు దొరికాయని, డబ్బులు పంపిణీ చేస్తున్నారని, డబ్బులు పంపిణీ అయ్యాయని ఇలా ఎన్నో రకాలుగా వ్యతిరేక ప్రచారం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎంతో మందిని వేధించినా జనాలకు బీజేపీ మీదనే సానుభూతి కలిగింది. రూలింగ్ పార్టీ వాళ్లను జనం నమ్మలేదు. ప్రతి స్టేట్  గవర్నమెంట్  డెవలప్​మెంట్​ స్కీంలో సెంట్రల్  గవర్నమెంట్  చేయి ఉందని బీజేపీ వాళ్లు దుబ్బాక ప్రజలను నమ్మించుకోగలిగారు. దుబ్బాకలో ఆరేండ్లుగా ఏ పని చేయకపోగా, ఇప్పుడు మళ్లీ ఎలక్షన్స్ లో వేలెత్తి చూపెట్టడం ప్రజలకు కూడా నచ్చలేదు. దానికి తోడు అసలు దుబ్బాకలో రూలింగ్ పార్టీ అభ్యర్థికి రాజకీయం, ప్రజా సేవ మీద అవగాహన, అనుభవం, విధానం ఉన్నదా అనే ప్రశ్నలు చాలానే వచ్చాయి.

గ్రేటర్​లో హోరాహోరీనే

దుబ్బాక ఫలితం తర్వాత రానున్న జీహెచ్​ఎంసీ ఎన్నికలు హోరాహోరీగా మారాయి. మొన్న హైదరాబాద్​లో కురిసిన కుండపోత వర్షాలకు సిటీ అతలాకుతలం కావడం, స్టేట్ గవర్నమెంట్ ఏమీ చేయలేక చేతులెత్తేయడం, వెదర్​ డిపార్ట్​ మెంట్​ వార్నింగ్ కూడా పట్టించుకోకపోవడం, చాలా మంది ప్రాణాలను పొట్టన పెట్టుకోవడంతో హైదరాబాదీలంతా బదులు తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ లో ఖర్చు పెట్టామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న డబ్బులు, ఎక్కడ ఖర్చు పెట్టారో ఎవ్వరికీ  తెలవదు. సదుపాయాలు చూద్దామనుకున్నా కనపడ్డం లేదు. మరోవైపు ఎల్​ఆర్​ఎస్​ స్కీం ఏం చేస్తుందో అని వారంతా బెంగపడుతున్నారు. మొన్నటి వర్షాలు, దుబ్బాక రిజల్ట్​ తర్వాత హైదరాబాద్ వాసులు ఎటు ఓటు వేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. దుబ్బాకని స్ఫూర్తిగా తీసుకుని కొత్త ఒరవడికి నాంది పలుకుతారా? అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. -రచనారెడ్డి, అడ్వొకేట్

Read more news…

స్కూల్ పోటీల్లో ఓడింది.. ఇప్పుడు ఒలింపిక్స్ నే టార్గెట్ చేసింది

బరువు తగ్గడం.. కష్టమేం కాదు