
- ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టర్ క్రాంతి
సంగారెడ్డి, వెలుగు: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఆదివారం సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీహెచ్ కు రానున్నారు. ఐఐటీ స్టూడెంట్స్ ఆవిష్కరిస్తున్న పలు ఈవెంట్స్ తోపాటు స్టూడెంట్స్ తో ముచ్చటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ క్రాంతి శనివారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఐఐటీ డైరెక్టర్ బీవీఎస్ మూర్తితో కలిసి క్యాంపస్ లోని హెలిప్యాడ్, సమావేశ స్థలాన్ని పరిశీలించారు. ప్రొటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలన్నారు.
వీఐపీ పార్కింగ్, ఎమర్జెన్సీ ఎగ్జిట్, హెలిప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లు, ఐడీ కార్డుల పంపిణీ తదితర అంశాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఐఐటీ ప్రాంతాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని ఎస్పీకి సూచించారు. డ్రోన్ కెమెరాలు, ఇతర ఫ్లయింగ్ పరికరాల వాడకంపై నిషేధం విధించారు. హాజరుకానున్న వీఐపీలకు గుర్తింపు కార్డుల పంపిణీ అంశాలపై విస్తృతంగా చర్చించారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ మాధురి, అడిషనల్ ఎస్పీ సంజీవ్ రావు, డీఎస్పీ సత్తయ్య గౌడ్, ఆర్డీవో రవీందర్ రెడ్డి, డీపీవో సాయిబాబా ఉన్నారు.