- 655 మంది మెదక్ రైతులు చరిత్ర సృష్టించారు
- ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ వ్యాఖ్య
- తన ఇంటికి అతిథులుగా రావాలని రైతులకు విజ్ఞప్తి
మెదక్, వెలుగు: మెదక్ జిల్లాలోని 655 మంది రైతులు సేంద్రియ సేద్యం చేపట్టి చరిత్ర సృష్టించారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ అన్నారు. సేంద్రియ సాగులో కౌడిపల్లి మండలంలోని తునికి గ్రామం తనకు మార్గదర్శకమని వెల్లడించారు. అక్కడి రైతులంతా సేంద్రియ పద్ధతిలోనే పంటలు సాగు చేసి తక్కువ టైంలో ఎక్కువ దిగిబడిని సాధించారని ప్రశంసించారు. తునికి రైతులతోపాటు మెదక్ జిల్లాలో సేంద్రియ సాగు చేస్తున్న ఈ 655 మంది రైతులంతా మూడు రోజుల పాటు ఢిల్లీలోని తన ఇంటికి అతిథులుగా రావాలని ఉపరాష్ట్రపతి కోరారు.
బుధవారం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలోని ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రాన్ని(కేవీకే) సందర్శించారు. అక్కడి రైతులు చేపడుతున్న సేంద్రీయ సాగు పద్ధతులను,సేంద్రీయ ఉత్పత్తులు, ఎరువుల స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో మాట్లాడారు." గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వికాసానికి జై జవాన్, జై కిసాన్ నినాదంతో లాల్ బహుదుర్ శాస్త్రి, అటల్‌జీ, మోదీ కృషి చేశారు.
త్వరలో జపాన్, జర్మనీ దేశాలను వెనక్కు నెట్టి ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా భారత్అవిర్భవించబోతున్నది. దేశం అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం కచ్చితంగా అవసరముంది. ఎక్కడ పండిన పంట ఉత్పత్తులను అక్కడ విక్రయిస్తేనే గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. రైతులు సాగులో నూతన పద్ధతులు వినియోగించుకునేలా కేవీకేలోని సైంటిస్టులు మరింత చైతన్యపరచాలి. రైతులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కేవీకే, ఐకార్ వంటి సంస్థలు బాధ్యత తీసుకోవాలి.
త్వరలో జరిగే కిసాన్దివస్రజతోత్సవాల్లో దేశంలోని 730 కేవీకేలు,150 ఐకార్ సంస్థలు పాల్గొనాలి" అని ఉపరాష్ట్రపతి కోరారు. సేంద్రీయ సాగు చేస్తున్న రైతులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ..రైతులు సేంద్రియ సాగు దిశగా అడుగులు వేస్తున్నారని..దీనికోసం ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రం చేసిన కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, కేవీకే చైర్మన్ పీవీ రావు తదితరులు పాల్గొన్నారు.