రాష్ట్రపతిని ఆదేశించే అధికారం కోర్టులకు లేదు:ఉపరాష్ట్రపతి

రాష్ట్రపతిని ఆదేశించే అధికారం  కోర్టులకు లేదు:ఉపరాష్ట్రపతి
  • జడ్జీలు ఆర్టికల్ 142ను ప్రజాస్వామ్యంపై మిస్సైల్​లా వాడుతున్నరు
  • బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతికే గడువు విధిస్తారా ?
  • సుప్రీంకోర్టు కామెంట్లపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌‌‌‌‌‌‌‌ఖఢ్ ఫైర్

న్యూఢిల్లీ: బిల్లులపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీంకోర్టు డెడ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ విధించడాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌‌‌‌‌‌‌‌ఖఢ్  తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రపతిని ఆదేశించే అధికారం దేశంలో ఏ కోర్టుకు లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని 142వ ఆర్టికల్ ద్వారా సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలు వ‌‌‌‌‌‌‌‌ర్తిస్తాయ‌‌‌‌‌‌‌‌ని.. అయితే ఆ ఆర్టికల్​ను ప్రజాస్వామ్య  వ్యవస్థపై ఓ న్యూక్లియ‌‌‌‌‌‌‌‌ర్ మిస్సైల్ లాగా కోర్టులు వాడుతున్నాయని అన్నారు.  

గురువారం ఆయన ఢిల్లీలోని వైస్ ప్రెసిడెంట్ ఎంక్లేవ్‌‌‌‌‌‌‌‌లో జ‌‌‌‌‌‌‌‌రిగిన 6వ రాజ్యసభ ఇంట‌‌‌‌‌‌‌‌ర్న్‌‌‌‌‌‌‌‌షిప్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రపతి లేదా గవర్నర్లు శాసనసభ ఆమోదించిన బిల్లులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌‌‌‌‌‌‌‌ల బెంచ్ గడువు విధించడం  కరెక్ట్ కాదని ధన్ ఖడ్ అన్నారు.

 ‘‘రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదు. 'సూపర్ పార్లమెంట్'గా వ్యవహరించే హక్కు కోర్టులకు ఉండదు. ‘రాష్ట్రపతి’ అనేది ఉన్నత రాజ్యాంగ పదవి. ఆ పదవిలో ఉన్నవారు రాజ్యాంగాన్ని సంరక్షించే బాధ్యతను కలిగి ఉంటారు" అని ధన్‌‌‌‌‌‌‌‌ఖఢ్ వివరించారు.  

ఇది రాజ్యాంగ సమతుల్యతకు దెబ్బ

రాష్ట్రపతిని జడ్జీలు ఆదేశించడం, జడ్జీలే చట్టాలను రూపొందించడం, కార్యనిర్వాహక విధులను నిర్వర్తించడం రాజ్యాంగ సమతుల్యతను దెబ్బతీస్తుందని ధన్‌‌‌‌‌‌‌‌ఖఢ్ వెల్లడించారు. "ఏదైనా చట్టపరమైన అంశంపై నిర్ణయం తీసుకునేందుకు రాజ్యాంగంలోని ఆర్టిక‌‌‌‌‌‌‌‌ల్ 145(3) ప్రకారం మాత్రమే కోర్టులకు హక్కు ఉంది. దానికి కూడా అయిదుగురు లేదా అంత‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌న్నా ఎక్కువ మంది జ‌‌‌‌‌‌‌‌డ్జీల‌‌‌‌‌‌‌‌తో ధ‌‌‌‌‌‌‌‌ర్మాస‌‌‌‌‌‌‌‌నం ఏర్పాటు చేయాలి. 

కానీ కొంతమంది న్యాయమూర్తులు సూపర్ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య సమతుల్యతకు భారత రాజ్యాంగమే ఆధారం. మనం రాజ్యాంగ పరిధికి లోబడే పని చేయాలి. అలా కాకుండా ఒక వ్యవస్థ మరొక వ్యవస్థ అధికారాలను అతిక్రమిస్తే, అది ప్రజాస్వామ్యానికే తీవ్ర ముప్పుగా పరిణమిస్తుంది" అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.  

ఆయనపై ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేయలేదు 

ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఘటనను  ధన్‌‌‌‌‌‌‌‌ఖఢ్ ప్రస్తూవిస్తూ.."జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా డబ్బు కట్టలు దొరికాయి. పేపర్లో వచ్చేంతవరకు దీని గురుంచి ఏడు రోజుల దాకా బయట ఎవరికీ తెలియలేదు. ఇలాంటి ఘటన ఓ సామాన్యుడి ఇంట్లో జరిగి ఉంటే మాత్రం విచారణ వేగం ఎలక్ట్రానిక్ రాకెట్‌‌‌‌‌‌‌‌లా ఉండేది. కానీ ఇప్పుడు అది ఎడ్లబండి కంటే నెమ్మదిగా సాగుతోంది. 

జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో డబ్బుల ఘటనపై ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ నమోదు కాకపోవడం ఆందోళనకరం.  చట్టం ప్రకారం..నేరం జరిగితే తప్పనిసరిగా ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ నమోదు చేయాలి. నమోదు చేయకపోవడం కూడా నేరమే. అలాంటప్పుడు ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ ఎందుకు నమోదు కాలేదు? రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లపై మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. 

ఆ స్పెషల్ పవర్స్ వారికి మాత్రమే ఉన్నాయి. కానీ న్యాయమూర్తుల విషయంలో ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ నమోదు చేయాలంటే న్యాయవ్యవస్థ అనుమతి తప్పనిసరి" అని ధన్‌‌‌‌‌‌‌‌ఖఢ్  వివరించారు.