ప్రపంచంతో పోటీ పడాలి .. టెక్నాలజీ, ఆవిష్కరణలతోనే దేశ ప్రగతి : ధన్ ఖడ్

ప్రపంచంతో పోటీ పడాలి .. టెక్నాలజీ, ఆవిష్కరణలతోనే దేశ ప్రగతి : ధన్ ఖడ్
  • ఐఐటీహెచ్ స్టూడెంట్లతో ఉపరాష్ట్రపతి 

సంగారెడ్డి, వెలుగు: మనం ప్రపంచంతో పోటీ పడినప్పుడే దేశం పురోగతి చెందుతుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ అన్నారు. కొత్త టెక్నాలజీలు, ఆవిష్కరణలు, పరిశోధనలే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటించారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఐఐటీహెచ్ డైరెక్టర్, ప్రొఫెసర్ బీఎస్ మూర్తి ఉపరాష్ట్రపతికి స్వాగతం పలకగా.. ఐఐటీహెచ్ స్టూడెంట్ల ఆవిష్కరణల గురించి చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి వివరించారు.

 అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ధన్ ఖడ్ మాట్లాడుతూ.. నేటి యువతరం చేపట్టే ఆవిష్కరణలే దేశాన్ని ముందుకు తీసుకెళ్తాయన్నారు.  అభివృద్ధి, ఆవిష్కరణలపై కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు ఉన్నంత మాత్రాన సరిపోదని, టీచర్ల కృషి, అంకితభావం కూడా ముఖ్యమన్నారు. విద్యార్థులు ప్రశ్నించడం, సమాధానాలు వెతకడాన్ని నేర్చుకోవాలని సూచించారు. విమర్శలను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. దేశంలో పరిశోధనలు, ఆవిష్కరణలతో డిజిటల్ మార్కెటింగ్ అభివృద్ధి చెందిందన్నారు. ఐఐటీల పరిశోధనల ఫలితంగానే నేడు 20 కోట్ల మంది రైతులకు నేరుగా నగదు బదిలీ సాధ్యమైందన్నారు. ఆవిష్కరణల్లో ఐఐటీ హైదరాబాద్ అగ్రగామిగా నిలుస్తోందని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. 

అమ్మ పేరిట ఒక మొక్క.. 

‘ఏక్ పేడ్, మాకే నామ్(అమ్మ పేరిట ఒక మొక్క)’ క్యాంపెయిన్ లో భాగంగా ఐఐటీ ప్రాంగణంలో ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్, ఆయన సతీమణి డాక్టర్ సుదేశ్ ధన్ ఖడ్ చెరో మొక్కను నాటారు. ఈ క్యాంపెయిన్ పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని ఆకాంక్షించారు. అనంతరం ఉపరాష్ట్రపతి దంపతులను కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఎస్పీ రూపేష్, ఐఐటీహెచ్ ప్రొఫెసర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు.