హరిద్వార్: ప్రజలు బ్రిటన్ ఆలోచనా విధానాలను వదిలెయ్యాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. చదువుల్లో మెకాలే సిస్టమ్‌ను పూర్తిగా పారదోలాలని సూచించారు. విదేశీ భాషను మీడియంగా పెట్టడం వల్ల దేశంలోని డబ్బున్న కొందరికే చదువు దగ్గరవుతోందని, పేదలు, అణగారిన వర్గాలకు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చదువును కాషాయమయం చేస్తున్నారంటూ చాలామంది అంటున్నారని, కాషాయమయం చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. కొత్త ఎడ్యుకేషన్ పాలసీకి ఇండియనైజేషనే మూలమన్నారు. శనివారం ఆయన హరిద్వార్‌లోని దేవ సంస్కృతి విశ్వవిద్యాలయలో సౌత్ ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ రీకన్సిలియేషన్‌ను ప్రారంభించారు. ‘‘మన తాత ముత్తాతలు, సంస్కృతి, వారసత్వాన్ని మనం గర్వంగా భావించాలి. ఇప్పటికైనా మన మూలాలను మనం వెతుక్కోవాలి. బ్రిటిష్ ఆలోచన విధానాలను వదిలిపెట్టి మనకంటూ సొంత గుర్తింపుతో ముందుకెళ్లాలి’’ అని
ఆయన సూచించారు.
గ్యాడ్జెట్లలో నోటిఫికేషన్లు సొంత భాషల్లో రావాలె
సొంత భాషను ప్రేమించాలని, దేశంలోని భాషలను వీలైనన్ని ఎక్కువ నేర్చుకోవాలని వెంకయ్య సూచించా రు. జ్ఞానానికి నిధి అయిన సంస్కృతాన్ని తప్పకుండా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని గ్యాడ్జెట్లలో నోటిఫికేషన్లు మన సొంతభాషల్లోనే వచ్చే రోజు కోసం ఎదురు చూస్తున్నానన్నారు. తల్లి భాష కంటి చూపులాంటిదని, పరాయి(విదేశీ) భాషలు కళ్లద్దాల్లాంటివని చెప్పారు. ‘సర్వే భవంతు సుఖిన:’, ‘వసుదైక కుటుంబం’ అని మన పురాణాలు చెప్తున్నాయని, ఇప్పటి మన విదేశీ విధానాలకు అవే మూలమని ఆయన తెలిపారు. ఏ దేశంపైనా ముందు యుద్ధానికి వెళ్లకూడదన్నది మన దేశ విధానమని, ప్రపంచం మొత్తం దానిని గౌరవిస్తోందని ఉపరాష్ట్రపతి వెంకయ్య చెప్పారు.