వైట్​ డ్రెస్​లో చాలా అందంగా ఉన్నావ్​ .. మదీనగూడలో ఇంటర్​ స్టూడెంట్స్​కు వైస్​ ప్రిన్సిపాల్​ మెసేజ్​లు

వైట్​ డ్రెస్​లో చాలా అందంగా ఉన్నావ్​ .. మదీనగూడలో ఇంటర్​ స్టూడెంట్స్​కు వైస్​ ప్రిన్సిపాల్​ మెసేజ్​లు
  • అందమైన మొహాలన్నీ నా ముందే ఉన్నాయ్.. నువ్వెక్కడున్నావ్.. 
  • మదీనగూడలో ఇంటర్​ స్టూడెంట్స్​కు వైస్​ ప్రిన్సిపాల్​ మెసేజ్​లు
  • స్నాప్​చాట్​లో సతాయిస్తుండడంతో ఆందోళన
  • స్టూడెంట్​ లీడర్లకు సర్ది చెప్పి పంపించిన పోలీసులు

మియాపూర్​, వెలుగు: ‘ఇవాళ వైట్ డ్రెస్ లో నువ్​చాలా అందంగా ఉన్నావ్.. ఏంట్రా నా మీద కోపమా రిప్లై ఇవ్వడం లేదు.. అందమైన మొహాలన్నీ ఇక్కడే ఉన్నాయ్.. నువ్వెక్కడున్నావ్.. నీకోసం ఎదురుచూస్తున్నా ’ అంటూ ఇంటర్​ స్టూడెంట్స్​కు స్నాప్​చాట్​లో అసభ్యకర మెసేజ్​లు పెడుతున్న ఓ వైస్​ ప్రిన్సిపాల్​బాగోతం బయటపడింది. ఎవరికైనా చెప్తే ఇంటర్నల్​ మార్కులు తక్కువగా వేస్తానని,ఫెయిల్ ​చేస్తానని బెదిరించడంతో వారు బయట పెట్టలేదు. మియాపూర్​మదీనగూడలోని ఓ కార్పొరేట్​ కాలేజీ డే స్కాలర్ క్యాంపస్ లో శివ వైస్ ప్రిన్సిపాల్.

కొంతమంది విద్యార్థినులకు స్నాప్ చాట్ లో రిక్వెస్ట్​ పెట్టడంతో సార్​కదా అని స్టూడెంట్లు యాక్సెప్ట్​ చేశారు. అప్పటి నుంచి వారికి అభ్యంతరరకంగా మెసేజ్ లు పంపిస్తున్నాడు. ‘నువ్​ కాలేజీకి రాలేదని నేను కూడా రాలేదు తెలుసా. నువ్ ​హర్ట్ అయితే నేను ఉండలేను’ అంటూ చాలామందికి మెసేజ్ లు పంపిస్తున్నాడు. 

ఒకవేళ స్టూడెంట్స్​ రిప్లై ఇవ్వకపోతే ‘నా మెసేజ్ ఇంకా చూడలేదు ఏంటి? అంత బిజీనా?’ అంటూ వేధిస్తున్నాడు. ఈ విషయం విద్యార్థి సంఘాల దృష్టికి వెళ్లడంతో మంగళవారం నవతెలంగాణ విద్యార్థి శక్తి రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కుమార్, ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి సెక్రటరీ ధర్మతేజ, ఇతర విద్యార్థి సంఘ లీడర్లు, బాధితులు కాలేజీ ఎదుట ధర్నాకు దిగారు.

దానికే అంత ఫీల్​ అవ్వాలా?

ధర్నా విషయం తెలుసుకుని మియాపూర్ పోలీసులు అక్కడికి రాగా, వైస్ ప్రిన్సిపాల్ శివ తమను వేధిస్తున్నాడని, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాధిత విద్యార్థులు తెలిపారు. విషయాన్ని కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్తే ‘మీరు బట్టలు తీసి డ్యాన్స్ చేస్తుంటే వీడియోలు తీయలేదుగా.. దానికే ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు’ అంటూ మాట్లాడారని వాపోయారు.

వైస్ ప్రిన్సిపాల్ శివపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఆందోళన విషయం తెలుసుకున్న యాజమాన్యం బస్సు డ్రైవర్లను కాలేజీలోకి పిలిపించింది. దీంతో తమపైన దాడి చేసేందుకే వారిని పిలిచారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. పోలీసులు నచ్చజెప్పడంతో విద్యార్థి నాయకులు వెళ్లిపోయారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు.