కలిసిరాని టీడీఆర్ బాండ్లు .. న్యాయం కోసం బాధితుల ఎదురుచూపులు

కలిసిరాని టీడీఆర్ బాండ్లు .. న్యాయం కోసం బాధితుల ఎదురుచూపులు
  • రోడ్లకు జాగాలు కోల్పోయినోళ్లకు టీడీఆర్ బాండ్లు ఇచ్చిన గత సర్కార్
  • ఇప్పుడు ఆ బాండ్లను తక్కువ ధరకే కొంటామంటున్న బిల్డర్లు 
  • జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో 20 వేల మంది బాధితులు  
  • సర్కారు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వినతులు

హైదరాబాద్, వెలుగు: రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి జాగాలు, ఇండ్లు కోల్పోయిన బాధితులకు పరిహారంగా గత ప్రభుత్వ హయాంలో అందజేసిన ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌(టీడీఆర్) బాండ్లు ఇప్పుడు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. టీడీఆర్ బాండ్లలో ఉన్న వ్యాల్యూ అంత కాకుండా.. అందులో కొంత శాతానికే కొంటామని బిల్డర్లు చెబుతుండటంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

జీహెచ్ఎంసీ పరిధిలో ఇలా టీడీఆర్ బాండ్లు(బదిలీకి వీలున్న హక్కు పత్రాలు) తీసుకుని ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితిలో దాదాపు 20 వేల మంది దాకా ఉంటారని అధికారులు చెబుతున్నారు. తమకు వాస్తవ నష్ట పరిహారం అయినా ఇప్పించాలని.. లేదా టీడీఆర్​ను బిల్డర్లు సరైన ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని టీడీఆర్ బాధితులు కోరుతున్నారు. ఈ విషయమై మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి గత ప్రభుత్వం తమను మోసం చేసిందంటూ గోడును వెల్లబోసుకుంటున్నారు.   

అదనపు అంతస్తులు దేవుడెరుగు..  

మార్కెట్ ధరకు అనుగుణంగా రెండు నుంచి నాలుగు రెట్ల వరకు టీడీఆర్‌లు ఉంటున్నాయి. గ్రామకంఠం భూములకు 200 శాతం, రిజిస్ట్రేషన్‌ భూమికి 400 శాతం టీడీఆర్‌ రూపంలో భూమికి పరిహారంగా ఇస్తారు. సర్టిఫికెట్ రూపంలో ఉండే ఈ విలువను అమ్ముకునేందుకు అవకాశం ఉంది. టీడీఆర్‌ ఉంటే నిర్మాణదారులు అనుమతి ఉన్నదానికంటే ఎక్కువగా అదనపు అంతస్తులు నిర్మించుకునేందుకు వీలుంటుంది. ఇది బిల్డర్లకు ఎంతో మేలు చేస్తుంది. 

అందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి దాంట్లో స్థలాలు కోల్పోయిన వాళ్లు టీడీఆర్​లు తీసుకునేందుకు ముందుకు వచ్చారు. టీడీఆర్​లను విక్రయించుకుంటే సాధారణ పరిహారం కంటే.. కొంత ఎక్కువే బిల్డర్ల నుంచి తీసుకునేందుకు వీలుంటుందని భావించి అలా తీసుకున్నారు. కానీ ఇప్పుడు బిల్డర్లు అందరూ కుమ్మక్కై టీడీఆర్​లు కొనుగోలు చేయడం లేదు. టీడీఆర్ వ్యాల్యూలో 30 శాతం వరకే ఇస్తమని అంటున్నారని బాధితులు చెప్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కలుగజేసుకోవాలని కోరుతున్నారు.

టీడీఆర్​లు తెచ్చారు ఇలా..  

నగరాలు, పట్టణాల్లో రోడ్ల విస్తరణ కోసం వినియోగించే ప్రైవేట్‌ స్థలాలకు ప్రత్యామ్నాయంగా టీడీఆర్‌ బాండ్లను జారీ చేస్తారు. భూ సేకరణ ఖర్చును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం.. టీడీఆర్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. భూసేకరణలో నగదుకు బదులుగా భూమికి భూమిని రెండు లేదా నాలుగు రెట్లు పరిహారంగా ఇవ్వాలనేది టీడీఆర్‌ ఉద్దేశం. గ్రామ కంఠం భూమికి రెండు రెట్లు.. అంటే వంద గజాల భూమి సేకరిస్తే 200 గజాలు.. అదే రిజిస్ర్టేషన్ స్థలం అయితే 400 గజాల భూమిని పరిహారంగా సర్టిఫికెట్ ఇస్తారు. 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో టీడీఆర్​ను అమల్లోకి తీసుకువచ్చింది.

 టీడీఆర్ సర్టిఫికెట్‌ ద్వారా యజమానులు తమ భూమిని గజాల చొప్పున అమ్ముకునేందుకు వీలు ఉంటుంది. అంటే ఒక ప్రాంతంలో ఏదైనా ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూమి సేకరిస్తే అక్కడ మార్కెట్ ధరకు డబ్బులు చెల్లిస్తుంది. కానీ టీడీఆర్‌ విధానం వల్ల రెండు రెట్లు లేదా నాలుగు రెట్ల భూమి పరిహారం సర్టిఫికెట్ల రూపంలో లభిస్తుంది. అవసరం ఉన్నవారు ఈ సర్టిఫికెట్లను కొనుగోలు చేయొచ్చు. ఈ భూముల్లో చేపట్టే నిర్మాణాల్లో అదనపు అంతస్తులు నిర్మించుకోవచ్చు. మొదట్లో టీడీఆర్​తో బాధితులకు మంచి పరిహారమే వచ్చింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో తీసుకున్నవాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.