కోల్‌కతా వైద్యురాలి ఘటనలో వికీపీడియాకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: దేశమంతటా సంచలనంగా మారిన కోల్తాలోని ఆర్జీ కర్ డాక్టర్ రేప్, మర్డర్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితురాలి ఫొటో, పేరు, గుర్తింపును ఎక్కడా.. ఏ రూపంలోనూ వాడొద్దని ఆదేశించింది. ఆమెకు సంబంధించిన వివరాలన్నింటినీ వెంటనే తొలగించాలని వికీపీడియాను ఆదేశించింది. కోల్‌కతా డాక్టర్ రేప్, మర్డర్ఘటనపై సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి విచారణ జరిపింది.
అత్యాచార ఘటనలో బాధితురాలి వివరాలను వెల్లడించడాన్ని భారతీయ చట్టాలు అనుమతించవని సీజేఐ డీవై చంద్రచూడ్నేతృత్వంలోని బెంచ్ పేర్కొన్నది. బాధితురాలి ఫొటో, పేరును వికీపీడియా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతాను ఆదేశించింది. అలాగే, సీబీఐ తాజాగా సమర్పించిన కేసు స్టేటస్ రిపోర్ట్‌ను బెంచ్ పరిశీలించింది. రిపోర్ట్‌లోని విషయాలు దిగ్భ్రాంతి కలిగించాయని పేర్కొంది. ఘటన జరిగిన తర్వాత ఆలస్యంగా ఐదు రోజులకు కేసును సీబీఐకి అప్పగించడం వల్ల కేసులో పురోగతి మందగించిందని జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. కేసు విచారణను వారానికి వాయిదా వేసింది.
మహిళలకు నైట్ డ్యూటీ వద్దంటారా?
ఆర్జీ కర్ ఘటన తర్వాత మహిళలకు నైట్ డ్యూటీలు వేయొద్దంటూ బెంగాల్ సర్కారు నోటిఫికేషన్ జారీ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ‘‘మహిళలు రాత్రిపూట పనిచేయలేరని మీరెలా చెప్తారు?” అని సీజేఐ చంద్రచూడ్ ప్రశ్నించారు. దీంతో ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు బెంగాల్ సర్కారు తెలిపింది.
కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్‌పై వేటు
డాక్టర్ల ఆందోళన నేపథ్యంలో కోల్‌కతా నగర పోలీస్కమిషనర్పై మమత సర్కారు వేటు వేసింది. డాక్టర్ల బృందానికి ఇచ్చిన హామీ మేరకు సీఎం మమతా బెనర్జీ.. సీపీ, మెడికల్ఎడ్యుకేషన్ డైరెక్టర్, హెల్త్ సర్వీస్ డైరెక్టర్లను తొలగించింది.