- పుస్తెల తాడు లాక్కొని వెళ్లారు
- ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకుంటలేరు
కాగజ్ నగర్, వెలుగు: ఊరిలో ఇంటి చుట్టూ కంచె వేస్తున్న సమయంలో గ్రామానికి చెందిన కొందరు గొడవపడి తనను, తన అన్నను కులం పేరుతో బూతులు తిడుతూ దాడి చేశారని, ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా దాడికి దిగిన వారికే మద్దతుగా నిలుస్తున్నారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తమ మీద జరిగిన దాడి విషయంపై సోమవారం కాగజ్ నగర్ డీఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు ఆదివాసీ గిరిజన నాయకులతో కలిసి వచ్చారు. డీఎస్పీ అందుబాటులో లేకపోవడంతో వారు మీడియాతో మాట్లాడారు. కాగజ్నగర్ మండలం కడంబా గ్రామా నికి చెందిన నేరపల్లి లక్ష్మణ్ కొలవార్వర్గానికి చెందిన వ్యక్తి. వారి ఇంటి చుట్టూ గత నెల 31న కంచె వేసుకుంటున్న సమయంలో గ్రామానికి చెందిన బీసీ వర్గానికి చెందిన కొందరు గొడవకు దిగారు.
ఈ క్రమంలోనే మాట మాట పెరగగా రంగయ్యతోపాటు మరో ఏడుగురు లక్ష్మణ్, ఆయన సోదరి కవితను కులం పేరుతో దూషిస్తూ కాళ్లతో తన్నుతూ దాడికి పాల్పడ్డారు. తన మెడలో ఉన్న పుస్తెలతాడు లాక్కొని వెళ్లారని కవిత ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై ఈజ్గాం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు తమను పట్టించుకోకుండా దాడి చేసిన వారికే అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగకపోతే ఆందోళన చేస్తామని కొలవార్ సంఘం నాయకులు పారిపల్లి పోశం, మేడిపల్లి బ్రహ్మయ్య హెచ్చరించారు.