
మొన్న కరీంనగర్, నిన్న వరంగల్.. ఇవాళ నిజామాబాద్. ఇలా చెప్పుకుంటూ పోతే రోజుకో జిల్లా నుంచి బాధితులు బయటపడుతున్నారు. అక్షర చిట్ ఫండ్స్ చేసిన మోసానికి సామాన్యులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కాయా కష్టం చేసి నాలుగు రూపాయలు వెనకేసుకుందాం అని దాచుకున్న డబ్బుతో కంపెనీ ఉడాయించడంతో బాధితులు రోడ్డున పడ్డారు.
తాజాగా నిజామాబాద్ జిల్లాలో అక్షర చిట్ ఫండ్స్ కంపెనీ బోర్డు తిప్పేయడంతో 70 మంది బాధితులు రోడ్డున పడ్డారు. చిట్టీలు కట్టించుకుని మొత్తం డబ్బుతో యాజమాన్యం ఉడాయించి కస్టమర్లను నిండా ముంచింది అక్షర చిట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీ. జిల్లాలో సుమారు 3 కోట్ల రూపాయలతో పారారైంది అక్షర చిట్స్ అండ్ ఫైనాన్స్ యాజమాన్యం.
రైతులు, చిరు వ్యాపారులు, రిటైర్డ్ ఉద్యోగులే లక్ష్యంగా మోసానికి పాల్పడ్డారు కంపెనీ నిర్వాహకులు. భవిష్యత్తు అవసరాల కోసం కంపెనీలో సేవింగ్స్ చేశారు బాధితులు. అంతా డబ్బు జమ అయ్యాక బోర్డు తిప్పేయడంతో బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ALSO READ | ప్రాణాలు అంటే లెక్క లేదా..? ఒక చేత్తో పబ్జీ గేమ్.. మరో చేత్తో క్యాబ్ డ్రైవింగ్
నిర్ణీత కాల వ్యవధిలో డబ్బులు తీసుకోవచ్చుననే ఉద్దేశంతో చిట్టీలు వేసినప్పటికీ.. గడువు ముగిసినా కంపెనీ డబ్బులు చెల్లించలేదు. చెక్కులు ఇచ్చినప్పటికీ బ్యాంక్ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ చూపిస్తుండటంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. తమను ఆదుకోవాలని పోలీసులను ఆశ్రయించారు బాధితులు.
బాదితుల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు ఇంతకు ముందేఅక్షర చిట్ ఫండ్ సంస్థ నిర్వాహకులు కొనుగోలు చేసిన రూ.14.27 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బాధితులకు తిరిగి డబ్బు ఇవ్వకపోగా, అర్ధాంతరంగా సంస్థలను మూసివేసి సభ్యులను మోసగించడంతో హన్మకొండకు చెందిన సంస్థ చైర్మన్ పేరాల శ్రీనివాసరావుతో పాటు డైరెక్టర్లు పేరాల శ్రీ విద్య, సూరనేని కొండలరావు, పుప్పాల రాజేందర్, అలువుల వరప్రసాద్, గోనె రమేశ్‌పై గత ఏడాది ఫిబ్రవరిలో కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.