రివకరీ ఏజెంట్ల వేధింపులు ఉరేసుకున్న బాధితుడు

  •     గుండె ఆపరేషన్, బిడ్డ పెండ్లికి లోన్లు తీసుకున్న కోరుట్ల వ్యక్తి  
  •     కార్పెంటర్​ పని సాగక, కట్టే పరిస్థితి లేక మనోవేదన
  •     ఇంటికి వచ్చి పరువు తీస్తామని బెదిరించిన రికవరీ ఏజెంట్లు 
  •     ఇల్లు అమ్మి ఇవ్వాలని వార్నింగ్​
  •     తెల్లారేసరికి భయంతో ప్రాణాలు తీసుకున్న శంకర్​
  •     పోలీసులకు ఫిర్యాదు 

కోరుట్ల, వెలుగు :  గుండె ఆపరేషన్ ​కోసం, బిడ్డ పెండ్లి కోసం కొన్ని బ్యాంకులు ఇచ్చిన క్రెడిట్​ కార్డుల నుంచి లోన్లు తీసుకున్నాడు. కార్పెంటర్ ​పని సాగక మొత్తం ఎమౌంట్​ కట్టలేక మినిమం కట్టుకుంటూ వస్తున్నాడు. దీంతో నెల నెలా వడ్డీలపై వడ్డీలు చక్రవడ్డీలు వేయడంతో ఈఎంఐల భారం గుదిబండలా మారింది. మినిమం కూడా కట్టలేని స్థితికి చేరుకున్నాడు. బంధువుల దగ్గర కూడా రూ.3 లక్షలు అప్పు చేసినా వారు ఇబ్బంది పెట్టలేదు. కానీ, కొన్ని బ్యాంకుల రికవరీ ఏజెంట్లు మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. పది నిమిషాలకోసారి ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఫోన్లు చేస్తూ సతాయించారు. తన పరిస్థితి చెప్పుకున్నా అర్థం చేసుకోలేదు. ఇంటి పక్కనున్నవాళ్లకు చెప్తామని, ఇంటికి వచ్చి పరువు తీస్తామని బెదిరించడమే కాకుండా భార్యకు ఫోన్​ చేసి బూతులు తిట్టడంతో భరించలేక ప్రాణం తీసుకున్నాడు. జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన ఈ ఘటన రికవరీ ఏజెంట్ల దౌర్జన్యాన్ని కండ్లకు కడుతోంది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం..కోరుట్లలోని అల్లమయ్యగుట్ట ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఏలేశ్వరం శంకర్(45) కార్పెంటర్. ఇతడికి కొడుకు లక్ష్మీనర్సింహాచారి, కూతురు హారిక ఉన్నారు. 

కోరుట్లలో పని సరిగ్గా సాగకపోవడంతో ఆరేండ్ల కింద శంకర్​ బెంగుళూరు వెళ్లి కార్పెంటర్‌‌గా పని చేశాడు. అదే సమయంలో అతడికి గుండె సర్జరీ జరిగింది. దీంతో గతేడాది కోరుట్లకు తిరిగి వచ్చాడు. బెంగళూరులో ఉన్నప్పుడే కొన్ని బ్యాంకులు అతడికి అవసరమున్నప్పుడు డబ్బులు వాడుకోవచ్చని క్రెడిట్​కార్డులు అంటగట్టారు. ఇక్కడికి వచ్చాక ఆఫర్లున్నాయని, తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తామని ఆశ పెట్టడంతో  బిడ్డ పెండ్లి, తన మెడిసిన్​, ఇతర ఖర్చుల కోసం మూడు, నాలుగు బ్యాంకుల్లో రూ.6 లక్షల వరకు లోన్లు తీసుకున్నాడు. కొన్ని నెలల పాటు ఈఎంఐలు కరెక్ట్​గానే కట్టినా పని దొరక్కపోవడంతో చెల్లించలేదు. ఈలోపు మనవరాలు పుట్టినా ఆమె అనారోగ్యానికి గురవడంతో వైద్యం కోసం మరో రూ.2 లక్షలు అప్పు చేశాడు. అటు కూడా చూసుకోవాల్సి వచ్చింది. అయినా ఆమె ప్రాణాలు దక్కలేదు. ఈఎంఐలు కట్టడానికి కొడుకు లక్ష్మీనర్సింహా చారి కూడా కార్పెంటర్ ​పనికి వెళ్లేవాడు. ఆ వచ్చే రూ.500 కూడా ఎటూ సరిపోయేవి కావు. బంధువుల దగ్గర  రూ.3 లక్షలు తీసుకుని బ్యాంకులకు చెల్లించినా అవన్నీ మిత్తీలకే పోయాయి. మితిమీరిన వడ్డీలతో ఈఎంఐలు కట్టడం తలకు మించిన భారమై ఆపేశాడు. దీంతో కొద్ది రోజుల నుంచి ఈఎంఐలు కట్టాలంటూ రికవరీ ఏజెంట్లు ఫోన్​ చేస్తున్నారు. 

భార్యకు ఫోన్​చేసి బూతులపర్వం  

రికవరీ ఏజెంట్లు రోజుకు సుమారు 50 నుంచి 100 వరకు కాల్స్ చేసి వేధించేవారు. ఫోన్​ చేసినప్పుడల్లా శంకర్​ తన బాధ చెప్పుకునేవాడు. డబ్బులు లేవని, గుండెకు సర్జరీ చేయించుకున్నాక మందులకు కూడా డబ్బులు లేవని, పని కూడా దొరకడం లేదని, కొంతటైం ఇస్తే ఎలాగైనా కడతానని మాటిచ్చాడు. అయినా వారు వినిపించుకోలేదు. ‘చాతగాని వాడివి ఎందుకు తీసుకున్నవ్​ రా..డబ్బులు కట్టకపోతే నీ ఇంటికి వచ్చి అందరి ముందు ఇజ్జత్ ​తీస్తం’ అని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే ఇల్లు అమ్మి కట్టాలని హెచ్చరించారు. సర్కారు ఇచ్చిన జాగాలో రెండు రూముల రేకుల షెడ్డు వేసుకున్నామని, అదే ఆధారమని చెప్పినా వినలేదు. ప్రతిసారి బతిమిలాడుతూ ఫోన్ ​మాట్లాడుతుండడంతో భార్యకు అనుమానం వచ్చి ఏమైందని అడిగింది. ఆమె బాధపడుతుందని విషయం చెప్పలేదు. ఇంటి ముందున్న వారికి గత శుక్రవారం, సోమవారాల్లో ఫోన్​ చేసి శంకర్​ అప్పు తీసుకున్నాడని పరువు తీసే ప్రయత్నం చేశారు. రెండు రోజుల కింద శంకర్​ భార్య మిల్లులో పనికి పోగా ఆమెకు కాల్​ చేశారు. ‘నీ మొగడు లోన్లు తీస్కొని కడ్తలేడు. నీకు బాధ్యత లేదానే...అసొంటోన్ని ఎందుకు చేసుకున్నవే’ అంటూ బూతులు తిట్టారు. ఫోన్​ కట్​చేసినా మాటి మాటికి ఫోన్ చేసి సతాయించారు.  
 

తెల్లారే సరికి ప్రాణాలు తీస్కున్నడు

పని ముగించుకుని రాత్రి వేళ ఇంటికి వచ్చిన భార్య తనకు రివకరీ ఏజెంట్ల నుంచి ఫోన్లు వచ్చిన సంగతి చెప్పింది. దీంతో శంకర్ ​బోరున విలపించాడు. తాను ఏమీ చేయలేకపోతున్నానని, ఎంత కష్టపడ్డా వచ్చే డబ్బులు వడ్డీలకు కూడా సరిపోవడం లేదని రోదించాడు. తెల్లారి ఇంటికి వస్తామని బెదిరిస్తున్నాడని, పరువు పోతుందని ఏడ్చాడు. దీంతో భార్య సముదాయించి ఏమీ కాదని చెప్పి స్థానిక కౌన్సిలర్​కు ఫోన్​ చేసింది. ఆయన పొద్దున్నే వచ్చి మాట్లాడుతానని, భయపడవద్దని భరోసా ఇచ్చాడు. అవసరమైతే పోలీస్​స్టేషన్​కు వెళ్లి కంప్లయింట్​ఇద్దామని చెప్పాడు. సరేనన్న శంకర్ బాధపడుతూనే పడుకున్నాడు. భార్య, కొడుకు వేరే గదిలో పడుకోగా తెల్లారి నాలుగ్గంటలకు లేసిన శంకర్​పనికి పోతానని చెప్పాడు. ఆరు గంటలకు లేచి చూడగా వేరే గదిలో ఉరేసుకుని కనిపించాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై శ్వేత డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించారు. మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సైలు కిరణ్ కుమార్, శ్వేత తెలిపారు.