
గద్వాల, వెలుగు: హోటల్ నుంచి పార్సిల్ తీసుకెళ్లిన టిఫిన్ చట్నీలో బల్లి రావడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో ఆదివారం జరిగింది. గద్వాల టౌన్ ఎస్సై కళ్యాణ్‌కుమార్, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని భీంనగర్‌లో గల అహ్మద్ టిఫిన్ సెంటర్‌లో ఆదివారం ఉదయం శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి టిఫిన్ పార్సిల్ తీసుకొని వెళ్లాడు. ఇంటికి వెళ్లాక టిఫిన్ తింటుండగా చట్నీలో చనిపోయిన బల్లి కనిపించింది. తర్వాత శ్రీనివాస్‌రెడ్డి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే గద్వాల గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
చట్నీలో బల్లి వచ్చిన విషయం బయటకు పొక్కడంతో ఆ హోటల్‌లో టిఫిన్ చేసిన వారంతా ఆందోళనకు గురై హాస్పిటల్‌కు పరుగులు పెట్టారు. కొందరు బాధితులు, వారి కుటుంబ సభ్యులు టిఫిన్ సెంటర్ వద్దకు వెళ్లి హోటల్ యజమానిని నిలదీశారు. ఈ సందర్భంగా వారి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. బాధితుల ఫిర్యాదుతో గద్వాల టౌన్ ఎస్సై కళ్యాణ్‌కుమార్ హోటల్ వద్దకు చేరుకొని తనిఖీలు చేసి, హోటల్‌ను మూసివేయాలని సూచించారు.