
మద్దూరు, వెలుగు: అటెండర్ గా పని చేసిన తన తల్లి జీతం డబ్బులు అడిగితే ఎస్సై కి చెప్పించి తనను మాజీ సర్పంచ్ కొట్టించాడని నారాయణపేట జిల్లా మద్దూరు మండలం అల్లీపూర్ కు చెందిన కావలి ఎల్లప్ప ఆరోపించాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గవర్నమెంట్ స్కూల్లో పని చేస్తున్న కవిత ఐదు నెలల కింద చనిపోగా, ఆ డ్యూటీని ఆమె అత్త భీమమ్మ చేస్తోంది. మూడు నెలల జీతం డబ్బులు రూ.9 వేలు తీసుకునేందుకు ఈ నెల 17న భీమమ్మ స్కూల్కు వెళ్లగా, టీచర్ రజిత సంతకం చేసి స్కూల్ చైర్మన్ చిన్న వెంకటమ్మ వద్దకు వెళ్లమని చెప్పారు. ఆమె మాజీ సర్పంచ్ రమేశ్ రెడ్డి చెబితేనే చేస్తానని చెప్పింది.
దీంతో ఆమె ఈ విషయాన్ని తన కొడుకు ఎల్లప్పకు చెప్పింది. అతను చైర్మన్, మాజీ సర్పంచ్ వద్దకు వెళ్లగా.. వారు స్కూల్ లో గొడవ చేస్తున్నాడని ఎస్సై విజయ్ కుమార్ కు ఫోన్ లో చెప్పారు. ఎస్సై తనను స్టేషన్కు పిలిపించి కొట్టాడని భాదితుడు ఎల్లప్ప మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. మండల ముదిరాజ్ సంఘం సభ్యులు, వివిధ పార్టీల నేతలు పోలీస్ స్టేషన్ ముందు భీమమ్మతో కలిసి ధర్నా చేశారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్సైపై సీఐ సైదులుకు ఫిర్యాదు
చేశారు.