
కాగజ్‌నగర్, వెలుగు : కాగజ్‌నగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో ఇటీవల ఏనుగు దాడిలో చనిపోయిన ఇద్దరు వ్యక్తుల కుటుంబాలకు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ తరపున రూ. 10 లక్షల చొప్పున పరిహారం మంజూరు చేశారు. దీనికి సంబంధించిన చెక్కును బుధవారం కాగజ్‌నగర్ ఇన్‌చార్జి ఎఫ్‌డీవో అప్పలకొండ మృతుల ఫ్యామిలీలకు అందజేశారు. ఈ సందర్భంగా అప్పలకొండ మాట్లాడుతూ ఏనుగుల ఆవాసాలను గుర్తించి అవి జనావాసాలలోకి రాకుండా రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఏనుగులకు అటవీ ప్రాంతాల్లో తాగునీరు, ఆహారం అందుబాటులో ఉండేలా చూస్తున్నామన్నారు. ఏనుగులు జనాల్లోకి వచ్చిన టైంలో తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తలు, ప్రవర్తన తీరుపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. భద్రతా వాహనాలు, డ్రోన్‌లు, నైట్ విజన్ కెమెరాల ద్వారా వన్య ప్రాణుల కదలికలను గుర్తించి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.