కన్నీరే మిగిలింది.. కేంద్ర బృందానికి వరద బాధితుల గోడు

కన్నీరే మిగిలింది.. కేంద్ర బృందానికి వరద బాధితుల గోడు
  • పశువులు కొట్టుకుపోయాయి
  • పొలాల్లో ఇసుక మేటలు వేశాయి
  • కేంద్ర బృందానికి వరద బాధితుల గోడు
  • ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో పర్యటన
  • దెబ్బతిన్న రోడ్లను పరిశీలిస్తున్న సెంట్రల్ టీం

ఖమ్మం/హైదరాబాద్: వరద కన్నీరే మిగిల్చింది. గొడ్డు గోదా అంతా కొట్టుకుపోయాయి.. మా బతుకులు ఆగమైనయ్.. ఆదుకోవాలి అంటూ వరద బాధితులు కేంద్ర బృందం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.  ‘పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి.. ఆదకోకుంటే ఆగమైతం..’అని కూసుమంచి మండలం కోక్యా తండాకు చెందిన అలావత్ నర్సింహారావు కన్నీరు మున్నీరయ్యారు.  రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం ఇవాళ ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటిస్తోంది.

కీర్తి ప్రతాప్​సింగ్​ నేతృత్వంలో ఈ బృందం పరిశీలన చేస్తోంది. ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు, తనకంపాడు గ్రామాల వద్ద దెబ్బతిన్న పంటపొలాలు, వరద ముంపు ప్రాంతాన్ని పరిశీలించి, ఫొటో ఎగ్జిబిషన్ ను కేంద్ర బృందం చూసింది. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వరద భీభత్సం, పంట నష్టాన్ని వివరించారు.  స్థానిక రైతులు కేంద్ర అధికారులతో తమ గోడును వెల్లబోసుకున్నారు. అంతకు ముందు సచివాలయంలో అధికారులతో కేంద్రం నుంచి వచ్చిన బృందం సమావేశమై వివరాలు సేకరించింది. అనంతరం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పంటనష్టం పరిశీలించేందుకు వెళ్లింది.

రెండు జిల్లాల్లో భారీ నష్టం
ఖమ్మం, మహబూబాబాద్​లో గత వారం రోజుల క్రితం వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు ఉప్పొంగి పరివాహక ప్రాంతాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. చాలా మంది కట్టుకున్న గుడ్డ తప్ప ఏం మిగల్లేదు. ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇళ్లు నామరూపాలు లేకుండా పోయి వరద నీటిలో కొట్టుకుపోయాయి. పశువులు, పంటలను చాలా మంది రైతులు కోల్పోయారు. మహబూబాబాద్​ జిల్లాలో పచ్చటి పొలాలు వరదలకు కొట్టుకుపోయి భూముల్లో ఇసుక మేటలు వేసింది. రైల్వే వంతెన వరదల దెబ్బకు పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు ఈ నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది.