RFCL Factory : కొలువు​ పాయె.. పైసలు రాకపాయె!

గోదావరిఖని, వెలుగు: రామగుండం ఫెర్టిలైజర్స్‌‌ అండ్‌‌ కెమికల్స్‌‌ లిమిటెడ్‌‌(ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌)‌ ఎరువుల ఫ్యాక్టరీలో పర్మినెంట్‌‌ ఉద్యోగాల కోసం డబ్బులు చెల్లించి మోసపోయిన బాధితులకు న్యాయం జరగడం లేదు. 8 నెలలుగా డబ్బులు ఇవ్వాలని దళారులను కోరుతున్నా వారి నుంచి ఆశించిన స్పందన రావడం లేదు. డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌ తన మాట నిలుపుకోలేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి అఖిల పక్షం ఏర్పాటు చేసినప్పటికీ ఆ కమిటీ నుంచి చాలామంది లీడర్లు బయటకు వచ్చారు. ఇంకా రూ. 4 కోట్ల వరకు రావాల్సి ఉండడంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారు.

ముంజ హరీశ్​ మరణంతో..

ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ ప్లాంట్‌‌లో వివిధ లొకేషన్లలో పనులు చేయించే మ్యాన్‌‌ పవర్‌ ‌సప్లై కాంట్రాక్ట్‌ ‌టెండర్‌‌ మొదట కోల్‌కత్తాకు చెందిన ఫైవ్‌‌ స్టార్‌ ‌అనే సంస్థకు లభించింది. ఆ సంస్థ నుంచి స్థానిక బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌ అనుచరులైన  మోహన్‌‌ గౌడ్‌‌, గుండు రాజు సబ్‌‌ కాంట్రాక్టు తీసుకున్నారు. ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌ ప్లాంట్‌‌లో పర్మినెంట్‌‌ ఉద్యోగం ఉంటుందని, నెలకు రూ.25 వేల జీతం వస్తుందని, క్వార్టర్‌‌ సౌకర్యం అంటూ అనేక ఆశలు కల్పిస్తూ ఊరూరా దళారుల ద్వారా ప్రచారం చేయించారు. ఒక్కొక్కరి వద్ద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశారు. ఈ కాంట్రాక్టు 2021 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఏడాది పాటు కొనసాగగా.. 2022 ఫిబ్రవరి నుంచి కొత్త సంస్థకు కాంట్రాక్టు టెండర్‌‌ వచ్చింది. అయితే  సబ్‌‌ కాంట్రాక్టు బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లకు రాకపోవడంతో టెండర్‌‌ పొందిన సంస్థ చాలామందిని పక్కన పెట్టింది. దీంతో తాము మోసపోయినట్టు బాధితులు గుర్తించి డబ్బులు తిరిగి ఇవ్వాలని  రోడ్డెక్కారు. కరీంనగర్‌‌ జిల్లా హుజురాబాద్‌‌ మండలం అంబాలాపూర్‌‌ గ్రామానికి చెందిన ముంజ హరీశ్​అనే బాధితుడు డబ్బుల కోసం ఎదురుచూసి విసిగిపోయి 2022 ఆగస్టు 27న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ దందాపై అన్ని వర్గాల్లో కదలిక వచ్చింది. 

అఖిలపక్షం ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే

ఉద్యోగాల పేరుతో మోసపోయిన బాధితులకు తిరిగి డబ్బులు ఇప్పిస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌ హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా అన్ని పార్టీలు, యూనియన్లతో అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయించారు. ఆత్మహత్య చేసుకున్న ముంజ హరీష్‌శ్​కుటుంబానికి దళారుల నుంచి రూ.29 లక్షల పరిహారం ఇప్పించేలా ఒప్పించారు. పలు దఫాలుగా సబ్‌‌ కాంట్రాక్టర్లు, దళారులతో అఖిలపక్ష కమిటీ ప్రతినిధులు చర్చించి బాధితులకు డబ్బులు తిరిగి చెల్లించేందుకు అంగీకరింపజేశారు.  అయితే ఈ డబ్బు చెల్లించేందుకు వాయిదాలు వేస్తుండడంతో అఖిల పక్ష కమిటీ నుంచి సీపీఐ, న్యూ డెమోక్రసీ, సీపీఎం, ఇతర పార్టీల లీడర్లు వైదొలగారు. తాజాగా కాంగ్రెస్‌‌ పార్టీ కూడా ఈ కమిటీ నుంచి తప్పుకుంది. 

77 మంది దళారులు..

ఉద్యోగాల కుంభకోణంలో ఇద్దరు సబ్‌‌ కాంట్రాక్టర్లతో పాటు మొత్తం 77 మంది దళారుల పాత్ర ఉన్నట్టు అఖిలపక్ష కమిటీ గుర్తించింది. ఇద్దరు సబ్‌‌ కాంట్రాక్టర్లు 248 మంది వద్ద రూ.12 కోట్లు వసూలు చేయగా...వీరి వద్దకు నిరుద్యోగులను తీసుకువచ్చిన దళారులు సుమారు రూ.4 కోట్ల వరకు దండుకున్నట్టు తేలింది. సబ్‌‌ కాంట్రాక్టర్లైన మోహన్‌‌ గౌడ్‌‌, గుండు రాజు తాము తీసుకున్న డబ్బులో రూ.ఆరు కోట్ల వరకు ఇవ్వడానికి ముందుకు వచ్చి అఖిలపక్షానికి అగ్రిమెంట్‌‌ పేపర్‌‌ రాసిచ్చారు. ఇందులో ఇప్పటివరకు రూ.1.6 కోట్లు మాత్రమే రిలీజ్‌‌ చేయడంతో కొంతమంది బాధితులకు 45 శాతం వరకు తిరిగి ఇచ్చారు. ముంజ హరీశ్​ కుటుంబానికి రూ.29 లక్షలకు రూ.14 లక్షలు చెల్లించారు. ఇక వివిధ ప్రాంతాలకు చెందిన 77 మంది దళారుల నుంచి రూ.4 కోట్ల వరకు రావాల్సి ఉండగా, ఆ డబ్బు ఎలా వసూలవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ దళారుల్లో 50 మంది వరకు బీఆర్‌‌ఎస్‌‌కు చెందిన లీడర్లు, ప్రజాప్రతినిధులే ఉన్నారని అఖిలపక్షం గుర్తించింది. కానీ నేడు అఖిలపక్ష కమిటీ నుంచి చాలామంది బయటకు రావడంతో ఈ డబ్బు వసూలు ఎలాగనేది ప్రశ్నార్థకంగా మారింది. 

మొత్తం డబ్బు చెల్లించాలి

ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌లో పర్మినెంట్‌‌ ఉద్యోగం పెట్టిస్తామంటే అప్పు తెచ్చి  రూ.7 లక్షలు ఇచ్చా. బ్యాగింగ్‌‌ సెక్షన్‌‌లో పనిచేస్తున్న సమయంలో అక్కడి నుంచి తొలగించి హౌజ్‌‌ కీపింగ్‌‌లో వేశారు. దీంతో ఇంత డబ్బు పెట్టి ఊడ్చే పని చేయలేక తప్పుకున్నా. ఇప్పటివరకు చేసిన ఆందోళనతో నాకు రూ.3.15 లక్షలు ఇచ్చారు. మిగిలిన డబ్బు కూడా ఇవ్వాలి. 
‒  ఐత శ్రావణ్‌‌, గోదావరిఖని