అట్రాసిటీ కేసుల్లో  అందని పరిహారం !

అట్రాసిటీ కేసుల్లో  అందని పరిహారం !
  • చెల్లింపుల్లో జాప్యం
  • ఎఫ్​ఐఆర్​నమోదులో కొందరికి..
  • చార్జ్​షీటు లెవల్లో మరికొందరికి ఇవ్వలే
  • రూ.30 లక్షలకు పైగా పెండింగ్​ ​

యాదాద్రి, వెలుగు : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు పరిహారం సరిగా అందడం లేదు. ఎఫ్ఐఆర్ బుక్​కాగానే కొంత, చార్జ్​షీటు వేయగానే మరికొంత పరిహారం బాధితులకు చెల్లించాల్సి ఉన్నా అందడం లేదు. ఎస్సీ, ఎస్టీలకు అవమానాలు, వారిపై దాడులు, అఘాయిత్యాలను అరికట్టడానికి, సత్వర న్యాయం చేయడానికి 1989లో కేంద్ర ప్రభుత్వం అట్రాసిటీ చట్టం తెచ్చింది.

ఈ చట్టం ప్రకారం బాధితుల కేసును బట్టి ప్రభుత్వపరంగా మూడు విడతల్లో రూ.లక్ష ఆపై మొత్తాన్ని పరిహారంగా అందించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన వాటాగా బాధితులకు అందించాలి. రూల్స్​ప్రకారం అట్రాసిటీ కేసుల్లో ఎఫ్ఐఆర్(ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదైన వెంటనే కేసును బట్టి రూ.లక్షకు తక్కువ కాకుండా నిర్ణయించిన పరిహారంలో 25 శాతం, పోలీసులు కోర్టుల్లో చార్జిషీట్​వేసిన తర్వాత 50 శాతం, శిక్ష ఖరారైన తర్వాత మరో 25 శాతం పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. 

జిల్లాలో 105 కేసులు..

అందిన సమాచారం ప్రకారం యాదాద్రి జిల్లాలో 2019 నుంచి ఇప్పటివరకు 105 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఇందులో పాత కేసులే 40 వరకు ఉన్నాయి. వీటిలో కులం పేరుతో దూషించడం, అత్యాచారం, అత్యాచారయత్నంతోపాటు రేప్​అండ్​మర్డర్​కేసులు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 80కి పైగా కేసులను పరిష్కరించగా, మిగిలినవి పెండింగ్​లో ఉన్నట్లు తెలుస్తోంది. దూషించిన కేసుల్లో రూ.లక్ష ఆపై పరిహారం నిర్ణయించగా రేప్ అండ్​మర్డర్​ కేసుల్లో రూ.8 లక్షల వరకు పరిహారంగా నిర్ణయించారు. 

పరిహారం కోసం బాధితుల ఎదురు చూపులు..

-అసభ్యంగా కులం పేరుతో దూషించిన కేసులో గతేడాది ఎఫ్ఐఆర్​నమోదైంది. భువనగిరి పట్టణానికి చెందిన బాధిత మహిళకు రూ.2 లక్షల పరిహారంగా నిర్ణయించారు. ఇందులో ఆమెకు రూ.20 వేలు అందాయి. చార్జీషీటు వేసిన తర్వాత రావాల్సిన వాయిదా మొత్తం రాలేదు. -భూదాన్​పోచంపల్లి మండలానికి చెందిన బాధిత మహిళకు రూ.2 లక్షల పరిహారంగా నిర్ణయించారు. ఎఫ్ఐఆర్​నమోదు తర్వాత ఆమెకు రూ.50 వేలు అందాయి.

చార్జీషీటు వేసిన తర్వాత రావాల్సిన అమౌంట్ రాలేదు.  -అసభ్యంగా కులం పేరుతో దూషించిన కేసులో 2023లో ఎఫ్ఐఆర్​నమోదైంది. రాజాపేట మండలానికి చెందిన బాధిత మహిళకు రూ.లక్ష పరిహారంగా నిర్ణయించారు. మొదటి విడత రావాల్సిన 25 శాతం అమౌంట్​రాలేదు. చార్జీషీటు వేసిన తర్వాత రెండో విడత రావాల్సిన 50 శాతం మాత్రం అందింది. 

పరిహారం సరిగా అందుతలే..

ఇప్పుడున్న లెక్కల ప్రకారం 45 అట్రాసిటీ కేసులపై ఎఫ్ఐఆర్​ నమోదైంది. ఈ కేసులకు మొత్తంగా రూ.73 లక్షలు పరిహారం అందించాల్సి ఉంది. రూల్స్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు కాగానే నిర్ణయించిన పరిహారం 25 శాతం అందించాల్సి ఉంది. అయితే వీరిలో ఆరుగురికి పరిహారం అందలేదు. చార్జ్​షీట్ వేసిన తర్వాత 18 మందికి పరిహారం అందలేదు. మొత్తంగా వీరికి రూ.30 లక్షలకు పైగా అందాల్సి ఉంది.

ఇటీవల కలెక్టరేట్​లో నిర్వహించిన విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్​హనుమంతు జెండగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతిని సమీక్షించారు. పెండింగ్​లో ఉన్న కేసులను పరిష్కరించాలని ఆదేశించారు.