బిడ్డపై అత్యాచార యత్నం.. కేసు ఫైల్​ చేస్తలేరని తల్లి ఆత్మహత్య

అన్నపురెడ్డిపల్లి, వెలుగు : కూతురిపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిపై పోలీసులు కేసు ఫైల్​చేయకపోవడంతో మనస్తాపంతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తాటిబుచ్చన్నగూడెం గ్రామానికి చెందిన బాలిక(17)ను మర్రిగూడెం గ్రామానికి చెందిన  వీరరాఘవులు(25) ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. వీరరాఘవులుకు ఇప్పటికే భార్యాపిల్లలు ఉన్నారు. అయినప్పటికీ బాలిక వెంట పడుతున్నాడు. గతంలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి హెచ్చరించినప్పటికీ ఫలితం లేకపోయింది.

ఈ నెల 24న బాలిక తమ పొలంలో పత్తి తీసేందుకు వెళ్లింది. అదే సమయంలో అక్కడకు వెళ్లిన వీరరాఘవులు ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు విని చుట్టుపక్కల పనిచేస్తున్న కూలీలు అక్కడికి రావడంతో రాఘవులు పరారయ్యాడు. విషయం తెలిసి బాలిక తల్లి వెంకటరమణ(40)అదేరోజు పోలీస్​స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. కులపెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించుకోవాలని ఎస్సై  విజయ సూచించింది. కులపెద్దల పంచాయితీతో తనకు న్యాయం జరగదని, వారం అవుతున్నా ఎస్సై కేసు నమోదు చేయడం లేదన్న మనస్తాపంతో వెంకటరమణ శనివారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగింది.

గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఎస్సై నిర్లక్ష్యం వల్లే వెంకటరమణ చనిపోయిందంటూ మృతురాలి కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆదివారం అన్నపురెడ్డిపల్లి పోలీస్​స్టేషన్ ఎదుట ఆందోళనకు గిగారు. సీఐ వసంతకుమార్ వారికి నచ్చజెప్పారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. వీర రాఘవులను అదుపులోకి తీసుకున్నారు.