యాక్సిడెంట్​ చేసిన వ్యక్తి ఇంటి ముందు డెడ్​బాడీతో నిరసన

మర్రిగూడ(చండూరు), వెలుగు: నల్గొండ జిల్లాలో యాక్సిడెంట్​చేసిన వ్యక్తి ఇంటి ముందు బాధితులు, గ్రామస్తులు డెడ్​బాడీతో నిరసనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.  వారు తెలిపిన వివరాల ప్రకారం.. గతనెల 24న రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పగిళ్ల వెంకటేశ్(33) బైక్​పై  మర్రిగూడ బయలుదేరాడు. అదే టైంలో బైక్‌పై ట్రిపుల్‌ రైడింగ్‌తో ఎదురుగా వచ్చిన కొట్టాల గ్రామానికి చెందిన బుర్ర రాజు.. వెంకటేశ్​బైక్​ను ఢీకొట్టాడు.

ప్రమాదంలో బుర్ర రాజు, పగిళ్ల వెంకటేశ్‌కి తీవ్ర గాయాలయ్యాయి.  వెంకటేశ్ పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి చనిపోయాడు. ఆదివారం మృతుడి భార్య, తన ఇద్దరు పిల్లలు, బంధువులు, గ్రామస్తులు వెంకటేశ్​డెడ్‌బాడీతో కొట్టాల చేరుకున్నారు.

బుర్ర రాజు ఇంటి దాదాపు 5 గంటల పాటు ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న నాంపల్లి సీఐ నవీన్, ఎస్సై రంగారెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకొని ఆందోళనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మృతికి కారణమైన వారిని శిక్షించి.. బాధిత కుటుంబానికి న్యాయం చేసేంత వరకు డెడ్‌బాడీని తీసుకెళ్లేది లేదని తేల్చి చెప్పారు.