ప్రభుత్వ భూమంటూ.. ఇండ్ల తొలగింపు యత్నం

ములుగు, వెలుగు : ప్రభుత్వ భూమిలో ఇళ్లు నిర్మించారంటూ జేసీబీతో కూల్చేందుకు ప్రయత్నించిన రెవెన్యూ అధికారులను బాధితులు అడ్డుకున్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని ప్రేమ్​నగర్​ సమీపంలో 20 ఎకరాల్లో మార్కెట్​యార్డ్​ నిర్మించారు. జిల్లాగా ఏర్పాటు కావడంతో మెడికల్​కాలేజీ, 200 పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం మార్కెట్​యార్డులోని 10 ఎకరాలను వైద్యశాఖకు అప్పగించారు. అయితే మార్కెట్​యార్డు గోడను ఆనుకొని ఐదు కుటుంబాలు 12 గుంటల జాగాలో ఇళ్లను నిర్మించుకొని జీవిస్తున్నాయి. గతంలో తాము భూమి కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నామని, గ్రామ పంచాయతీ నుంచి ఇంటి యాజమాన్య పత్రం సైతం పొందామని, ఇంటి పన్ను, నీటి పన్ను, కరెంటు బిల్లులు కూడా చెల్లిస్తున్నామని బాధితులు చెబుతున్నారు. 

ఈ భూమి 2018 నుంచి రెవెన్యూ శాఖలో లావణి పట్టాగా చూపిస్తోందని, తాము కొన్నప్పుడు పట్టా భూమిగానే ఉందని చెబుతున్నారు. గురువారం ములుగు తహసీల్దార్​ ఎం.సత్యనారాయణ స్వామి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఇళ్లను కూల్చేందుకు వెళ్లడంతో స్థానికులు అడ్డుకున్నారు. చెంచురెడ్డి అనే వ్యక్తి ఇంటి గోడను జేసీబీతో ధ్వంసం చేశారు. దీంతో చెంచురెడ్డి పురుగులమందు తాగేందుకు ప్రయత్నించగా వెంటనే అడ్డుకొని ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఆందోళనతో అధికారులు వెనుతిరిగారు.  

నిర్మాణాలను తొలగిస్తాం: తహసీల్దార్​

ఆ భూమిపై కోర్టులో ఏడాది కాలంగా వాదోపవాదాలు నడిచాయని ములుగు తహసీల్దార్​సత్యనారాయణ చెప్పారు. భూమికి సంబంధించి వారు ఎలాంటి పత్రాలు చూపలేకపోయారన్నారు. దీంతో ముందస్తు నోటీసులు అందజేసి నిర్మాణాలు తొలగించేందుకు వెళ్లామన్నారు. కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని, ప్రభుత్వ అభివృద్ధి కార్యకలాపాల కోసం ఈ భూమిని కేటాయిస్తామన్నారు.