మాట మారుస్తుండ్రు .. ఏసీబీ కేసుల్లో చివరివరకు నిలబడని సాక్షులు

 మాట మారుస్తుండ్రు .. ఏసీబీ కేసుల్లో చివరివరకు నిలబడని సాక్షులు
  • లంచం తీసుకున్న అధికారికి అనుకూలంగా మారుతున్న వైనం
  • తప్పుడు సాక్ష్యం చెప్పినవారిపై కోర్టుల్లో కేసులు

ఆదిలాబాద్, వెలుగు : అవినీతి అధికారులను పట్టిస్తున్న బాధితులు.. కేసు విచారణకు వచ్చేసరికి మాట మార్చేస్తున్నరు. లంచం అడిగిన సమయంలో ఆవేదనతో ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్న బాధితులు.. చివరకు అవినీతి అధికారికి అనుకూలంగా మారుతున్నారు. లంచం అడిగినందుకు ఏసీబీకి పట్టించి మళ్లీ అదే అధికారికి వత్తాసు పలుకుతున్నారు. ఇలా కేసును తప్పుదోవ పట్టిస్తుండటంతో సాక్షులపై కోర్టు సీరియస్ గా వ్యవహరిస్తోంది. తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు అవినీతి అధికారితోపాటు బాధితుడు, సాక్షి కూడా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. లంచం కేసులో అధికారిని మళ్లీ ఆయనకే అనుకూలంగా సాక్ష్యం చెప్పడంతో ఇటీవల ముగ్గురిపై కేసు నమోదు చేయాలని ఆదిలాబాద్​ కోర్టు ఆదేశించింది. 

సీరియస్ గా హెచ్చరిస్తున్న ఏసీబీ కోర్టు

అవినీతి అధికారులపై ఏసీబీకి సమాచారమిచ్చిన బాధితుడు చివరివరకు మాటపై నిలబడడం లేదు. ఇలా పట్టుబడ్డ కేసుల్లో బాధితులు కోర్టులో హాజరైన తర్వాత తమకేం తెలియదంటూ బుకాయిస్తున్నారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి కేసుల్లో లంచం తీసుకున్న వారితోపాటు ఫిర్యాదు చేసినవారిపై కూడా కేసులు నమోదవుతున్నాయి. ఏసీబీకి పట్టుబడ్డ వారికి కోర్టులో శిక్ష పడాలంటే చాలా సమయం పడుతుంది. ఈలోగా బాధితుడికి సదరు అవినీతి అధికారి డబ్బు ఆశ చూపడం, మరేదైనా లబ్ధి చేకూరుస్తుండడంతో.. కేసు కోర్టుకు వచ్చేలోపు ఫిర్యాదుదారుడు తప్పుడు సాక్ష్యం చెబుతున్నాడు. ఇలాంటి వ్యవహారాలపై న్యాయస్థానం సీరియస్ అవుతోంది. కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పినవారిపై గతంలో ఎప్పుడూ లేని విధంగా కేసులు నమోదవుతున్నాయి.

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లికి చెందిన సిరికొండ పోచయ్య తన వ్యవసాయ భూమిలో బోరు బావికి కరెంట్ కనెక్షన్ కోసం స్థానిక విద్యుత్​శాఖ కార్యాలయంలో గతంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆ కనెక్షన్ ఇచ్చేందుకు అప్పటి ఏఏఈ కొండా రామచంద్రంను కలువగా ఆయన రూ.4 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో పోచయ్య ఆదిలాబాద్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రామచంద్రంను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. తర్వాత కేసు విచారణలో పోచయ్య ఏఏఈకి అనుకూలంగా సాక్ష్యం చెప్పాడు. అలాగే ప్రైవేట్ కాంట్రాక్టర్ డబ్బులు డిమాండ్ చేశాడని అబద్దం చెప్పడంతో ఏసీబీ కోర్టులో కేసు నమోదైంది. 

నిర్మల్ లో మత్స్య సంఘం రిజిస్ట్రేషన్​కు సంబంధించి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యుల నుంచి లంచం అడిగిన మత్స్య శాఖ సీనియర్ అసిస్టెంట్, మత్స్య శాఖ సహాయ సంచాలకుడు అంజయ్యకు జైలు శిక్ష పడింది. అయితే ఈ కేసులో అధికారిని పట్టించిన పోశెట్టి, దేవన్న అబద్ధం సాక్ష్యం చెప్పినట్లు విచారణలో తేలింది. మిగతా సాక్ష్యాలు బలంగా ఉండడంతో అవినీతి అధికారికి శిక్ష పడింది. తప్పుడు సాక్ష్యం చెప్పిన పోశెట్టి, దేవన్నపై కేసులు నమోదు చేశారు.

తాజాగా ఇచ్చోడ ఎన్టీడీసీఎల్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ రేగుంట స్వామి 2010లో ముగ్గురి నుంచి రూ.15 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఎలక్ట్రికల్ మీటర్ల ఏర్పాటుకు కన్నమయ్య, నారాయణ, మల్లయ్య అనే వ్యక్తులు ఏడీఈని సంప్రదించగా ఆయన రూ.15 వేలు లంచం డిమాండ్ చేయడంతో వారు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు రైడ్ చేసి ఏడీఈని పట్టుకున్నారు. ఈ కేసు విషయంలో ముందు చెప్పిన సాక్ష్యం తాము చెప్పలేదని ఆ ముగ్గురు జడ్జి ముందు మాటమార్చారు. దీంతో కోర్టు వీరిపై ఆగ్రహం వ్యక్తం చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దాదాపు 15 ఏండ్లు కొనసాగిన ఈ కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పిన ఆ ముగ్గురిపై కేసు నమోదైంది. 

తప్పుడు సాక్ష్యం చెప్పొద్దు

ఏసీబీ కేసుల్లో ఇటీవల తప్పుడు సాక్ష్యాలు చెప్పిన ఫిర్యాదుదారులపై కూడా కేసులు నమోదవుతున్నాయి. లంచం ఇచ్చే సమయంలో అధికారిని పట్టించే బాధితులు కోర్టులో శిక్ష పడేంతవరకు మాట మార్చకూడదు. తప్పుడు సాక్ష్యం చెప్పొద్దు. అప్పుడే అవినీతి అధికారులకు తగిన శిక్ష పడుతుంది.  

విజయ్ కుమార్, ఏసీబీ డీఏస్పీ ఆదిలాబాద్