సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో బాధితులు

సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో బాధితులు
  • బ్యాంక్ ​మేనేజర్​ అప్రమత్తతతో వృద్ధుడి రూ.30 లక్షలు సేఫ్

సికింద్రాబాద్, వెలుగు: ఓ సీనియర్​ సిటిజన్​ను బెదిరించి సైబర్​ నేరగాళ్లు డబ్బులు కొట్టేద్దామని చూడగా, బ్యాంక్​ మేనేజర్ ​అప్రమత్తతతో సేఫ్​గా ఉన్నాయి. వృత్తిరిత్యా డాక్టర్లయిన 78 ఏండ్ల  భార్యాభర్తలు అల్వాల్ లోతుకుంటలో నర్సింగ్​ హోమ్​  నిర్వహిస్తున్నారు. సదరు డాక్టర్​కు  బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి సైబర్ కేటుగాళ్లు కాల్ చేశారు.  ‘మీ పేరు మీద మలేషియా నుంచి ఓ పార్సిల్​ వచ్చింది. అందులో 16 పాస్ పోర్టులు, ఏటీఎం కార్డులున్నాయి’ అని చెప్పారు. ఆ తర్వాత ఏసీపీ పేరుతో ఓ వ్యక్తి లైన్​లోకి వచ్చి, సదరు డాక్టర్ ​బ్యాంకు ఖాతా, ఆధార్​ వివరాలడిగి తీసుకున్నాడు. 

తనపై 30 బ్యాంకు ఖాతాలున్నాయని, అందులో రూ.88 కోట్ల మనీ లాండరింగ్ జరిగిందన్నారు. రూ.30 లక్షలు ఇస్తే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పాడు. తన దగ్గర అంత డబ్బు ఇప్పుడు లేదని, తన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాలో రూ.30 లక్షలు ఉన్నాయని చెప్పాడు. సరేనంటూ ఆ ఖాతా నుంచి డబ్బులను ఎస్బీఐ సేవింగ్ ఖాతాకు బదిలీ చేసుకోవాలని కోరాడు. దీంతో డాక్టర్​ కంగారుగా మధ్యాహ్నం లోతుకుంటలోని ఎస్​బీఐకి వెళ్లాడు. బ్రాంచ్​ మేనేజర్ ​నవీన్ కుమార్​ను కలిసి తన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాలోని  డబ్బులను సేవింగ్ ఖాతాలోకి మార్చాలని కోరాడు. 

అయితే, కారణమేంటని అడగ్గా, ఆయన తన భార్యకు బ్రెయిన్​ స్ర్టోక్​ వచ్చిందని, జూబ్లీహిల్స్​లోని ఓ ప్రైవేట్​ దవాఖానలో  చేర్చామని చెప్పాడు. బ్రాంచ్​ మేనేజర్​కు అనుమానం వచ్చి అపోలో దవాఖానలో విచారించగా, అలాంటి వాళ్లు ఎవరూ లేరని తెలిసింది.  అప్పటికే రిపీటెడ్​గా డాక్టర్​కు కాల్స్ వస్తుండడంతో ఇది సైబర్​ నేరగాళ్ల పనేనన్న అనుమానం మేనేజర్​కు కలిగింది. అల్వాల్​ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి డాక్టర్​కు అవగాహన కల్పించారు. కేసు నమోదు చేసి సైబర్​ క్రైమ్ ​విభాగానికి బదిలీ చేయనున్నట్లు తెలిసింది.

రూ.32 లక్షలు మునిగిన ప్రైవేటు ఉద్యోగి

బషీర్ బాగ్, వెలుగు: కొరియర్​లో డ్రగ్స్ రవాణా చేస్తున్నావంటూ ఓ ప్రైవేట్​ఉద్యోగిని బెదిరించి, సైబర్​ క్రిమినల్స్ రూ.32 లక్షలు కొట్టేశారు. సిటీకి చెందిన 38 ఏండ్ల ప్రైవేట్ ఉద్యోగికి తొలుత సైబర్ చీటర్స్ ముంబైలోని ఫిడెక్స్ ఇంటర్నేషనల్ కొరియర్ నుంచి మాట్లాడుతున్నామని ఫోన్ చేశారు. ముంబై ఎయిర్ పోర్ట్​లో బాధితుడి పేరుపై ఇరాన్​కు వెళ్తున్న పార్సిల్​ను పోలీసులు, సీబీఐ అధికారులు సీజ్ చేశారని చెప్పారు. 

ఈ విషయమై ముంబై పోలీసులు మాట్లాడతారని చెప్పి, కాల్ కట్​ చేశారు. కొద్దిసేపటికి సైబర్ నేరగాళ్లు బాధితుడికి ఫోన్ చేసి, సీజ్ చేసిన పార్సిల్ లో రెండు గడువు ముగిసిన ఇండియన్ పాస్ పోర్ట్స్, మూడు హార్డ్ డిస్క్ లు , 5.5 కిలోల మెడిసిన్ తో పాటు 450 గ్రాముల డ్రగ్స్ ఉన్నాయని చెప్పారు. అయితే, అది తాను పంపిన కొరియర్ కాదని బాధితుడు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. మనీలాండరింగ్​కు కూడా పాల్పడ్డావని, ముంబైలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినట్లు తమ దగ్గర సమాచారం ఉందన్నారు. తనపై కేసు నమోదైందని, ఏ క్షణమైనా అరెస్ట్ చేయాల్సి వస్తుందని బెదిరించారు. 

కేసు నుంచి బయటపడాలంటే వెరిఫికేషన్ ​కోసం బ్యాంక్ అకౌంట్ వివరాలు చెప్పాలని ఒత్తిడి చేశారు. దీంతో భయపడిన బాధితుడు సైబర్ చీటర్స్ అడిగిన అకౌంట్ వివరాలన్నీ చెప్పాడు. తర్వాత స్కైప్​లో కాల్ చేసి, బాధితుడి అకౌంట్ లో ఉన్న డబ్బులను ట్రాన్స్​ఫర్​ చేయాలన్నారు. ఆర్బీఐ రూల్స్​ ప్రకారం వెరిఫై చేసి 24 గంటల్లో డబ్బులను తిరిగి పంపిస్తామని నమ్మబలికారు. అలాగే పోలీస్ ​క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా పంపిస్తామన్నారు. ఇదంతా నిజమేనని నమ్మిన బాధితుడు అతని అకౌంట్ లోని రూ. 31.86 లక్షలను సైబర్ చీటర్స్ సూచించిన అకౌంట్ కు  ట్రాన్స్​ఫర్​ చేశాడు. 24 గంటలు గడిచినా సైబర్ చీటర్స్ నుంచి ఫోన్ కాల్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు.