దెబ్బతిన్న ఇండ్లు, మునిగిన పంటలు

దెబ్బతిన్న ఇండ్లు, మునిగిన పంటలు
  • పెద్దపల్లి జిల్లాలో వరదలలో దెబ్బతిన్న ఇండ్లు, మునిగిన పంటలు
  • నెల రోజులుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్న బాధితులు
  • పట్టించుకోని ఆఫీసర్లు 

పెద్దపల్లి, వెలుగు: గతనెల వరదల వల్ల పెద్దపల్లి జిల్లాలో పెద్ద సంఖ్యలో ఇండ్లు మునిగిపోగా, చాల వరకు కూలిపోయినయి. పంటలు నీటి పాలయ్యాయి. నెల రోజులైనా ముంపు బాధితులకు, ఇండ్లు కూలిపోయిన వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. ఇండ్లు కూలిపోయిన వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతూ సర్కార్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. గత నెల కురిసిన భారీ వర్షాలకు గోదావరి, మానేరు నదులు వరద పోటెత్తడంతో మంథని పట్టణంతో పాటు దాదాపు పది గోదావరి పరివాహక ప్రాంత గ్రామాలు నీట మునిగాయి. వరదలకు కొన్ని ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి, చాలా వరకు పూర్తిగా ధ్వంసం కావడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

రిపోర్టులు బుట్టదాఖలు..

జూలై 9 నుంచి 16వ తేదీ మధ్య వచ్చిన వరదలతో పెద్దపల్లి జిల్లాలోని మంథని, కాల్వశ్రీరాంపూర్, రామగుండం, ఓదెల మండలాలతోపాటు  మంథని పట్టణం సగానికిపైగా నీట మునిగింది. బిల్డింగులు గ్రౌండ్​ఫ్లోర్ వరకు పూర్తిగా నీట మునిగిపోవడంతో వారం రోజుల పాటు వివిధ షెల్టర్లలో ఆశ్రయం కల్పించారు. వరదలు తగ్గు ముఖం పట్టినా కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలతో మండల స్థాయి అధికారులు పర్యటించి నామమాత్రంగా సర్వే చేశారు.  సర్వే చేసి తీసుకొని 20 రోజులు అవుతున్నా సాయం విషయంలో సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఇండ్లతో పాటు పంటలూ పోయినయి..

వరదలకు ఇండ్లతోపాటు పంటలు కూడా దెబ్బ తినడంతో బాధిత కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా 591 ఇండ్లు పాక్షికంగా, 18 ఇండ్లు పూర్తిగా కూలిపోయినయి. ప్రభుత్వపరంగా పాక్షికంగా దెబ్బతిన్న వాటికి రూ.5200, పూర్తిగా కూలిపోయిన వాటికి రూ.95,100 సాయాన్ని ఇవ్వాల్సి ఉంది. మంథని పట్టణంలో పెద్ద సంఖ్యలో ఇండ్లు దెబ్బతిన్నాయి. షాపు యజమానులు తీవ్రంగా నష్టపోయారు. మెడికల్ షాపులు, ఫర్టిలైజర్, బట్టలు, కిరాణ, బుక్​స్టాల్స్, ఎలక్ట్రికల్ షాపులు నీట మునుగడంతో లోపల ఉన్న మెటీరియల్ తడిసిపోవడంతో పనికికాకుండా పోయాయి. వీరంతా లక్షల్లో నష్టపోయినట్లు చెప్తున్నారు. దానిపై ఎలాంటి నివేదికలు అధికారులు తీసుకోలేదు. మరోవైపు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలోని 142 గ్రామాల పరిధిలో 7,485 ఎకరాల్లో 4,796 మంది రైతుల పత్తి పంట దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. అలాగే 46 గ్రామాల పరిధిలో 556 మంది రైతులకు చెందిన 1000 ఎకరాల్లో వరిపంట నీట మునిగినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ నిజానికి నష్టం అంతకు పది రెట్లు ఉంటుందని తెలుస్తోంది. గోదావరి, మానేరు పరివాహ గ్రామాల్లో కాళేశ్వరం బ్యాక్ వాటర్​తో మునిగాయి. వరద వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి, బాధితులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవడంలేదని అంటున్నారు.

రూ.20 లక్షలు పైగా నష్టపోయాను

అన్నారం బ్యాక్ వాటర్​తో మంథని పట్టణం పూర్తిగా మునిగిపోయింది. వ్యాపారస్తులు ప్రతీ ఒక్కరూ దాదాపు రూ.10 లక్షల పైనే నష్టపోయారు. నా ఫర్టిలైజర్ దుకాణంలో నీరు నిండిపోవడంతో ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ పూర్తిగా పాడైపోయినయి. ప్రభుత్వానికి వర్తక సంఘాల నుంచి వినతిపత్రాలు రాసినా పట్టించుకుంటలేరు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాము. 
- గొంది వెంకటేశ్వర్లు, ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మంథని