- వర్కట్‌పల్లిలో సర్వే అడ్డుకున్న బాధితులు
- ఎన్నిసార్లు నష్టపోవాలని ఆందోళన
యాదాద్రి, వెలుగు: వలిగొండ మండలం రెడ్ల రేపాక, వర్కట్‌పల్లి, చౌటుప్పల్ మండలం నేలపట్లలో సర్వే పనులను బాధితులు మంగళవారం అడ్డుకున్నారు. అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలుమార్లు భూములను కోల్పోయామని, మరోసారి కోల్పోలేమని తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం తమకు అవసరం లేదని డిమాండ్ చేశారు. రీజినల్ రింగ్ రోడ్డు కోసం యాదాద్రి జిల్లాలోని ఐదు మండలాల్లో 1853.04 ఎకరాలను సేకరించాల్సి ఉంది. తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో 580.17 ఎకరాలు, భువనగిరిలో 492, వలిగొండ, చౌటుప్పల్ మండలాల్లో 780.27 ఎకరాలను సేకరించనున్నారు. గతంలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటికే తాము భూములు ఇచ్చామని, మళ్లీ ఇవ్వమంటే ఎలా..? అంటూ రైతులు సర్వేను అడ్డుకున్నారు. రైతులు అడ్డుకుంటున్నా పోలీసుల సహకారంతో సర్వే ముగించారు. ఇప్పుడు ఫైనల్ గెజిట్ కోసం సర్వే నెంబర్లు, రైతుల వారీగా సర్వే చేస్తున్నారు.
అలైన్మెంట్ మారదంటున్న ఆఫీసర్లు
రైతులు సర్వేను ఆపినా.. అలైన్మెంట్ మారదని ఆఫీసర్లు చెబుతున్నారు. రింగ్‌రోడ్డుకు సంబంధించిన సర్వే గతంలోనే ముగిసిపోయిందని, దీనికి సంబంధించి రోడ్డు మ్యాప్ కూడా రెడీ అయిందని ఆఫీసర్లు చెబుతున్నారు. సర్వేను అడ్డుకుంటే రికార్డుల్లో ఉన్న రైతుల పేర్లతో గెజిట్‌ను ప్రభుత్వం ప్రచురిస్తుందని అంటున్నారు. దీనివల్ల అనుభవదారుడిగా ఉన్న రైతుకు పరిహారం అందకుండా నష్టం జరుగుతుందని చెబుతున్నారు. భూ సేకరణపై ఇటీవల నిర్వహించిన సర్వేకు తాము పబ్లిష్ చేసిన గెజిట్‌లో పేర్కొన్న భూ సేకరణ వివరాలకు మధ్య ఏ మాత్రం భూ విస్తీర్ణం తేడా ఉన్నా ఆయా సర్వే నెంబర్ల వారీగా త్రీ ఏ నోటిఫికేషన్ జారీ చేస్తామని అంటున్నారు. గెజిట్‌లో పేర్కొన్న విస్తీర్ణానికి, తాము నిర్వహించిన సర్వేలో తేలిన భూమికి తేడా లేకుంటే ఆయా సర్వే నెంబర్లకు సంబంధించి పూర్తి వివరాలతో త్రీ డీ(డిక్లరేషన్) నోటిఫికేషన్ జారీ చేస్తామంటున్నారు. ఈ రెండు నోటిఫికేషన్ల తర్వాత గడిచిన మూడేండ్లలో ఏడాది వారీగా భూముల ధరల్లో మార్పులను పరిశీలించిన తర్వాత పరిహారానికి సంబంధించి నేషనల్ హైవే ఆఫీసర్లు అవార్డు ప్రకటిస్తారని ఆఫీసర్లు తెలిపారు.
అనుభవదారుల కోసం
- ఉపేందర్‌రెడ్డి, ఆర్డీవో, చౌటుప్పల్
రీజినల్ రింగ్ రోడ్డు కోసం భూమిని కోల్పోయే వారికి పరిహారం అందించడం కోసం సర్వే జరుగుతోంది. సర్వే నెంబర్ల వారీగా రికార్డుల్లో ఉన్న వారు, అనుభవదారుడిగా ఉన్న రైతు ఒక్కరేనా.? వేర్వేరా..? అన్నది తెలుసుకుంటున్నాం. ఈ సర్వే పూర్తైన తర్వాత పరిహారం అందించాల్సిన రైతుల పేర్లతో గెజిట్ ప్రచురణ జరుగుతుంది.