
- ఖమ్మం జిల్లాలో రూ.20 కోట్లకు పైగా వసూళ్లు!
- కారేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
కారేపల్లి, వెలుగు: దుబాయ్ కేంద్రంగా నిర్వహిస్తున్న మెటాప్లస్ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ యాప్ లో మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీస్ స్టేషన్లో ఏజెంట్ సురేశ్ పైఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. రూ.5 వేల నుంచి రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే రెట్టింపు డబ్బులు ఇవ్వడంతో పాటు గోవా, కేరళ, బ్యాంకాక్ టూర్లకు తీసుకెళ్తామని చెప్పి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ సంస్థ ఇప్పటికే 500 మందికి పైగా సభ్యులను చేర్పించుకున్నట్లు చెబుతున్నారు. కొందరిని ఏజెంట్లుగా పెట్టుకొని, చైన్ సిస్టం ద్వారా సభ్యులుగా చేర్చుకున్నారు.
మొదట చేరిన కొందరి ఖాతాల్లో రెట్టింపు డబ్బులు పడడంతో మిగతా వారు భారీగా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. 3 నెలలుగా సంస్థ డబ్బులు చెల్లించకపోవడంతో ఏజెంట్లపై ఒత్తిడి పెరిగింది. ఏజెంట్లను నిలదీస్తున్నప్పటికీ డబ్బులు జమ కాకపోవడంతో కారేపల్లికి చెందిన సురేశ్ అనే ఏజెంట్ పై బాధితులు ఉపేందర్, రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెటాప్లస్ ఇన్వెస్ట్మెంట్ యాప్ పై ఫిర్యాదులు వచ్చాయని, విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని కారేపల్లి ఎస్సై రాజారాం తెలిపారు.