నిజాం ప్రభువు 16 ఎకరాల విస్తీర్ణంలో అనాథ పిల్లల కోసం విక్టోరియా మెమోరియల్ హోం, ఇండస్ట్రియల్ స్కూల్ ఏర్పాటు చేశారు. 1902లో విక్టోరియా మహారాణి మరణానంతరం ఆమె పేరు మీదుగా ఒక మెమోరియల్ హోంను స్థాపించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో విక్టోరియా హోంను ఏర్పాటు చేశారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ 1896లో ప్రస్తుతం గడ్డి అన్నారం మార్కెట్ ఎదురుగా ఉన్న ప్రదేశంలో తన విశ్రాంతి కోసం ఒక భవన నిర్మానాన్ని ప్రారంభించారు.
కొంత భాగం నిర్మాణమైన తర్వాత భవనాన్ని పరిశీలించడానకి మీర్ మహబూబ్ అలీఖాన్ వెళ్లిన సమయంలో ఏదో అశుభం జరిగిందని దానిని నిర్మాణాన్ని నిలిపివేయించారు. బ్రిటన్ రాణి విక్టోరియా 1902లో మరణించిన అనంతరం హైదరాబాద్‌లోని బ్రిటీష్ రెసిడెంట్ జనరల్ సర్ డేవిడ్ బార్ ఆమె స్మృత్యార్థం హైదరాబాద్‌లో మెమోరియల్ ఏర్పాటు చేయాలని సంకల్పించాడు.
ఈ విషయాన్ని మీర్ మహబూబ్ అలీఖాన్‌కు తెలియజేయగా అసంపూర్తి నిర్మాణ భవనాన్ని పూర్తి చేయించి సర్ డేవిడ్ బార్ కు అప్పగించారు. సర్ డేవిడ్ బార్ వరంగల్‌లో నిర్వహిస్తున్న అనాథ ఆశ్రమాన్ని ఈ భవనంలోకి మార్చి 1905, జనవరి 1న విక్టోరియా మెమోరియల్ హోం ఫర్ ఆర్ఫన్స్ అనే పేరును పెట్టారు.