
న్యూఢిల్లీ: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా ఎలాంటి హడావుడి లేకుండా స్వదేశానికి చేరుకుంది. తొమ్మిది నెలల్లో ఇండియాకు రెండో ఐసీసీ టైటిల్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మరికొంత మంది ప్లేయర్లు సోమవారం రాత్రే ముంబైకి చేరుకున్నారు. వారం విశ్రాంతి తర్వాత ఐపీఎల్‌లో బరిలోకి దిగనున్నారు. ‘కొంత మంది ప్లేయర్లు ఫ్యామిలీతో కలిసి సోమవారమే దుబాయ్ నుంచి బయలుదేరారు. మరికొందరు ప్లేయర్లు అక్కడే ఉన్నారు. ఈసారి ఎలాంటి హడావుడి లేకుండా ప్లేయర్లు ఇండియాకు వచ్చేశారు’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
గతేడాది టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత రోహిత్ బృందం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది. ముంబైలో విక్టరీ పరేడ్‌లో కూడా పాల్గొంది. కానీ ఈసారి అలాంటి కార్యక్రమాలేవి నిర్వహించడం లేదు.. కోచ్ గౌతమ్ గంభీర్, పేసర్ హర్షిత్ రాణా డైరెక్ట్‌గా ఢిల్లీకి వెళ్లగా, ఆదివారం రాత్రి స్టేడియం నుంచి తిరిగి వచ్చిన వెంటనే కోహ్లీ, అనుష్కతో కలిసి హోటల్ నుంచి బయలుదేరాడు. ఇక పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ నెల 16న ఆ టీమ్‌తో చేరతాడు.