కర్నాటకలో గెలుపు.. కాంగ్రెస్, బీజేపీకి కీలకం

మే10న జరిగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఎంత కీలకమో, కర్నాటకలో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అంతే కీలకం. మే13న వెలువడే ఆ రాష్ట్ర ఫలితాల ప్రభావం ఈ ఏడాది జరిగే ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఉంటుంది. కర్నాటక అసెంబ్లీ పోరు.. విస్తృత రాజకీయ పరిణామాలు కలిగి ఉన్న ఎన్నిక. ఎందుకంటే కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్​వరకు భారత్​ జోడో యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, ఇటీవల రాహుల్​పై పార్లమెంట్​లో అనర్హత వేటు పడటం తర్వాత బీజేపీ, కాంగ్రెస్​మధ్య జరుగుతున్న మొదటి పోరు ఇది. ఢిల్లీలోని తుగ్లక్ లేన్ లో ఉన్న అధికారిక బంగ్లా నుంచి వెళ్లిపోవడం రాహుల్ గాంధీ పట్ల సానుభూతిని పెంచింది. ఆయన ఇమేజ్ మేకోవర్ అయింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించగలిగితే, అదే ఊపుతో కాంగ్రెస్​ను పెంచుకునే వీలు ఉంటుంది.

 ప్రతిపక్ష ఐక్యతను తీసుకురావడానికి కాంగ్రెస్ తన ప్రయత్నాలను నమ్మకంగా ముందుకు తీసుకెళ్లాలంటే, కర్నాటకలో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో అజేయంగా విస్తరిస్తున్న బీజేపీని ఎదుర్కోవడానికి, ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నందున, కర్నాటక వంటి ప్రధాన రాష్ట్రంలో ఎన్నికల విజయం కాంగ్రెస్ నైతికతను, మనోధైర్యాన్ని పెంచుతుంది. కాంగ్రెస్​ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్​ రాష్ట్రాలు సహా కర్నాటకలోనూ ప్రభుత్వాలను కోల్పోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. హిమాచల్ ప్రదేశ్‌ ఎన్నికల విజయం కొంత ఓదార్పునిచ్చినా, వరుస పరాజయాల తర్వాత 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సత్తాచాటాలంటే కర్నాటకలో గెలవడం అనివార్యం. అక్కడ గెలుపు పార్టీ శ్రేణుల్లో అలుముకున్న నిరాశ ఛాయలను తొలగించగలుతుంది. మాజీ సీఎం సిద్ధరామయ్య, పార్టీ చీప్​ డీకే శివకుమార్ ​మధ్య ఆధిపత్య పోరు ఉన్నా.. పార్టీని విజయతీరాలకు చేర్చడంపైనే వారు దృష్టి సారించాల్సి ఉంది. సీఎం ఎవరన్నది పార్టీ గెలిస్తేనే కదా! 

కాషాయ పార్టీకీ ముఖ్యమే..

దక్షిణాన కాషాయ పార్టీకి బలమైన పునాది ఉన్న ఏకైక రాష్ట్రం కర్నాటక. ఇక్కడ అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కర్నాటకను గేట్​వేగా చేసుకొనే తెలంగాణ సహా ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో తమ స్థావరాన్ని విస్తరించుకోవాలని బీజేపీ చూస్తున్నది. ఇలాంటి సమయంలో కర్నాటక అదుపు తప్పితే అది కాషాయ పార్టీకి ఎదురుదెబ్బే. దక్షిణాదిలో కొత్త రాష్ట్రాలను, ప్రత్యేకించి తెలంగాణలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. కర్నాటకలో అధికారం చేజారితే కొత్త రాష్ట్రాలను గెలుచుకోవడం ఇబ్బంది కావొచ్చు. బీజేపీ తన డబుల్ ఇంజన్ సర్కారు సిద్ధాంతాన్ని పునరుద్ఘాటించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా తన అడుగుజాడలను విస్తరించేందుకు ఆ పార్టీ అనుసరిస్తున్న ఫార్ములా ఇదే. కాబట్టి కర్నాటకలో గెలవడం బీజేపీకి చాలా ముఖ్యం. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌ రాష్ట్రాల్లో బీజేపీ గత ఎన్నికల్లో ప్రజల విశ్వాసం చూరగొనలేకపోయింది. కాబట్టి ఇప్పుడు కర్నాటకలో అధికారాన్ని నిలబెట్టుకొని దేశంలో బీజేపీ హవా కొనసాగుతోందని నిరూపించుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా మారింది. ప్రతిపక్షం ఇంకా గందరగోళంలోనే ఉండగా.. సార్వత్రిక ఎన్నికల సన్నాహాల్లో బీజేపీ చాలా ముందుంది. ఈ క్రమంలో ప్రతిపక్షం కంటే ముందంజలో కొనసాగాలంటే కర్నాటకలో గట్టి విజయం సాధించాలి.

సవాలుగా ప్రభుత్వ వైఫల్యాలు

కర్నాటకలో బీజేపీపై వ్యతిరేకత ఉంది. 40 శాతం కమీషన్ సర్కార్ అనే ట్యాగ్‌తో ఆ పార్టీ అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోంది. టిక్కెట్ల పంపిణీ కూడా సజావుగా సాగలేదు. ఫలితంగా రాష్ట్ర మాజీ సీఎం జగదీష్ శెట్టర్, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాది బీజేపీతో తెగతెంపులు చేసుకొని కాంగ్రెస్‌లో చేరారు. ఆ అసంతృప్తి అదుపు తప్పి బహిరంగ తిరుగుబాటుగా మారింది. రాష్ట్ర సీఎంగా బీఎస్ యడ్యూరప్ప స్థానంలో బసవరాజ్ బొమ్మై వచ్చినప్పటి నుంచి పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హిందూత్వ ఎజెండాపై కఠినంగా వ్యవహరించడంలో ప్రయోజనం పొందారు. హిందూత్వ ఆధారిత ప్రచారాలు జరగడం,  క్రైస్తవ వ్యతిరేక దాడుల పెరుగుదలకు దారితీసింది. హిజాబ్ వివాదం అంతర్జాతీయ వార్తల్లో నిలిచింది. హిందూత్వ వేడిని పెంచడం ద్వారా టిప్పు సుల్తాన్ వర్సెస్ హిందూత్వ సిద్ధాంతకర్త సావర్కర్‌పై పోలరైజింగ్ చర్చ జరిగింది. ఇలాంటివన్నీ ఆ పార్టీకి ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజల ఓట్లను పొందడానికి ఆటంకంగా మారాయి. 

రంగంలోకి అమిత్​ షా, మోడీ

బీజేపీకి స్టార్ క్యాంపెయినర్‌గా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్​షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కొనసాగుతున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ప్రధాని మోడీ తన పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేయడానికి గత నాలుగు నెలలుగా కర్నాటకలో అనేక పర్యటనలు చేస్తున్నారు. బడ్జెట్​లో కర్నాటకకు ప్రత్యేక నిధులు ఇవ్వడంతోపాటు, ఆ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం కొనసాగుతూ వచ్చింది. అయితే, మోడీ మ్యాజిక్ నిజంగా క్షేత్రస్థాయిలో మార్పు తెచ్చేంతలా పని చేస్తుందో లేదో చూడాలి. రెండు జాతీయ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు దృష్ట్యా, జేడీఎస్​రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. ముస్లింల ఓట్లను చీల్చుకోవాలనే ఆశతో మాజీ కేంద్ర మంత్రి సీఎం ఇబ్రహీంను రాష్ట్ర జేడీ(ఎస్) అధ్యక్షుడిగా ఆ పార్టీ నియమించింది, అలాగే వొక్కలిగాలపై తన పట్టును సుస్థిరం చేసుకుంది. కానీ, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోలరైజేషన్ ప్రకారం, జేడీఎస్ ప్రభావం అంతంత మాత్రమే.
-
 అనితా సలూజా, పొలిటికల్​ కామెంటేటర్