- క్రాస్ ఓటింగ్‌పై కమలం ఆశలు
- గెలుపు మాదే అంటున్న బీఆర్ఎస్
- పోలింగ్‌పై ఎవరి అంచనాలు వారివే
- ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం
- జూన్ 4 వరకు అన్ని పార్టీల్లో టెన్షన్
మంచిర్యాల, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమైన పోలింగ్ ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న వెలువడనున్న రిజల్ట్స్ కోసం ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులతోపాటు అన్ని వర్గాలవారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలకు ఇంకా 20 రోజుల టైమ్ ఉండడంతో పోలింగ్ సరళిపై ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 15.96 లక్షల ఓటర్లుండగా 67.83 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే సుమారు10.85 లక్షల మంది ఓట్లేశారు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్నియోజకవర్గంలో 68.13 శాతం, బెల్లంపల్లిలో 70.53, మంచిర్యాలలో 59.78 శాతం ఓట్లు పోలయ్యాయి. ధర్మపురిలో 73.34, రామగుండంలో 61.59, మంథనిలో 69.90, పెద్దపల్లిలో 71.34 శాతం మంది ఓటు వేశారు. వీటిలో మెజారిటీ ఓట్లు ఏ పార్టీకి పడ్డాయన్నదానిపై ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు.
కాంగ్రెస్ ధీమా..
పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి సీటుపై కాంగ్రెస్ మొదటి నుంచి ధీమాతోనే ఉంది. ఆ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరఫున ఐటీ, ఇండస్ట్రీస్ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సారథ్యంలో ఎమ్మెల్యేలంతా ఏకమై విస్తృతంగా ప్రచారం చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంతో కాకా వెంకటస్వామి ఫ్యామిలీకి ఉన్న అనుబంధాన్ని, ఆయన అందించిన సేవలను గుర్తు చేస్తూ ప్రచారం నిర్వహించారు. విద్యావంతుడు, యువకుడైన వంశీ చిన్నతనంలోనే పారిశ్రామికవేత్తగా సక్సెస్ అయ్యారని, ఈ ఎన్నికల్లో ఆయనను గెలిపిస్తే ప్రభుత్వరంగ పరిశ్రమలను తీసుకురావడమే కాకుండా ఈ ప్రాంత సమస్యలపై పార్లమెంట్లో కొట్లాడుతారని ఎమ్మెల్యేలు ప్రజలకు భరోసా ఇచ్చారు. వంశీకృష్ణ సైతం తన స్పీచ్‌లతో ఆకట్టుకున్నారు.
యువతకు ఉద్యోగాలు కల్పించే ఆశాకిరణంగా కనిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోని ఏడు సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 6.82 లక్షలు, బీఆర్ఎస్కు 3.74 లక్షలు, బీజేపీకి 69 వేల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ 3 లక్షలకు పైగా మెజార్టీ సాధించింది. ఎంపీ ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ మెజార్టీ సాధిస్తామని ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలపై గట్టి నమ్మకం పెట్టుకున్నారు. మహిళలు, రైతులు, కార్మికులు, ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీల ఓట్లు కాంగ్రెస్‌కే పడ్డాయని భావిస్తున్నారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తే మెజార్టీ తగ్గే అవకాశం ఉన్నప్పటికీ గెలుపు ఖాయమని కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు.
హిందూత్వం, మోదీ చరిష్మా..
ఎలాంటి అంచనాలు లేకుండా ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ క్రాస్‌ఓటింగ్‌పై గంపెడాశలు పెట్టుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిష్మాతో హిందూత్వ ఓట్లు పడతాయని, అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మరింత వీక్ కావడం బీజేపీకి కలిసి వచ్చింది. బీఆర్ఎస్కు ఓటు వేయకపోతే బీజేపీకి వేయాలంటూ ఆ పార్టీ నాయకులు పలుచోట్ల క్రాస్ ఓటింగ్ చేయించినట్టు తెలుస్తోంది. హిందూత్వవాదులు, యువత బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
లెక్కలేసుకుంటున్న బీఆర్ఎస్
పెద్దపల్లి ఎంపీ ఎన్నికల్లో తామే గెలుస్తామని బీఆర్ఎస్ నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. తమకు ఎన్ని ఓట్లు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 7 నియోజకవర్గాల్లో చతికిలబడ్డ బీఆర్ఎస్ గ్రాఫ్ ఆ తర్వాత మరింత దిగజారినట్టు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటేసినా ఇటు రాష్ట్రంలో గానీ, అటు కేంద్రంలో గానీ అధికారంలోకి వచ్చేది లేదు, ఆ పార్టీతో ఒరిగేదేమీ లేదని ఓటర్లు అభిప్రాయానికి వచ్చారు. చాలాచోట్ల ఆ పార్టీ నాయకులే బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేయించారు. కరడుగట్టిన తెలంగాణవాదులు, కేసీఆర్ అభిమానులతో పాటు కొన్ని వర్గాలు మాత్రమే బీఆర్ఎస్కు ఓట్లు వేసినట్టు తెలుస్తోంది. ఇలా ఎవరికి వారే అంచనాలు వేసుకుంటూ గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టారన్నది జూన్ 4న తెలియనుంది.