విశ్లేషణ:సింహాలు తమ చరిత్రను రాసుకోకపోతే వేటగాడు రాసేదే చరిత్ర అవుతుంది అనేది ఎంత నిజమో ఈ దేశ మూలవాసుల చరిత్ర ఘట్టాలు అన్నీ వక్రీకరణకు గురయ్యాయనడం కూడా అంతే నిజం. మన పోరాటాలు కనుమరుగుకావడం, సంస్కృతులు, సంప్రదాయాలు, పండుగలు ప్రతి ఒక్కటీ మార్పులకు లోనయ్యాయి. బహుజన సాహితీవేత్తలు, రచయితలు, చరిత్రకారులు స్పందించకపోవడంతో నిజమైన వీరుల చరిత్రలు కాలగర్భంలో కలిసిపోయాయి. చరిత్రకెక్కిన ఈ దేశ మూలవాసుల విజయాల్లో మహర్ రెజిమెంట్ విజయ్ దివస్ మొదటిది. 28 వేల మంది పీష్వా సైన్యంతో మహర్ రెజిమెంట్ కు చెందిన 500 మంది జరిపిన భీకర యుద్ధం చరిత్రలో నిలిచిపోయింది. దళితులను మనుషులుగా కూడా చూడకుండా నడుముకు తాటాకు, మెడలో ముంతతో సమాజానికి దూరంగా ఉంచిన పీష్వాల తీరుపై అణగారిన వర్గాల ఆత్మగౌరవ పోరాట విజయమే భీమా కోరేగావ్.
చరిత్రలో ఓ మైలురాయి
భీమా కోరేగావ్ మహారాష్ట్రలోని పూణేకు 35 కి.మీ దూరంలో ఉన్న ఓ చిన్న గ్రామం. బ్రిటీష్ వర్తకులు ఈస్టిండియా కంపెనీ స్థాపించి, ఇండియాను రాజకీయంగా గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్న రోజులవి. 1818 జనవరి1న భీమా నది వద్ద పీష్వాలకు ఈస్టిండియా కంపెనీ నేతృత్వంలోని మరాఠాలకు భీకర యుద్ధం జరిగింది. ఈ పోరాటంలో దళితులు బ్రిటీష్ సైన్యం పక్షాన నిలిచారు. ఏండ్లుగా.. అంటరానితనాన్ని తమపై రుద్దిన పీష్వాల పాలనను అంతం చేయడం కోసమే వారు బ్రిటీష్ సైన్యంతో కలిసి పోరాటం చేశారు. అందుకే దళిత పోరాటాల చరిత్రలో భీమా కోరేగావ్ యుద్ధం ఒక మైలురాయి .
పీష్వాల ఏలుబడిలో దళితుల అణచివేత
శివాజీ పాలన తర్వాత వచ్చిన పీష్వాల ఏలుబడిలో దళితులు తీవ్ర అణచివేతకు గురయ్యారు. పీష్వాలు దళితులను ఏనాడూ మనుషులుగా చూడలేదు. నడుముకు చీపురు, తాటాకులు, మెడలో ముంతతో వారిని దారుణంగా అవమానించేవారు. వారి నీడ కూడా తమపై పడకూడదని అగ్రవర్ణాల వారు ఇండ్లకు రానిచ్చేవారు కాదు. దళితుల అడుగులను వారే చెరిపేసుకునేలా నడుము వెనక చీపురు కట్టుకొని, ఉమ్మినా బయట పడకుండా ఉండేందుకు మూతికి ముంత కట్టుకొని రావాలనే నిబంధన పెట్టేవారు. పొరపాటున ఎవరైనా రూల్ బ్రేక్ చేస్తే.. దళితులైన మహర్, మాతంగ్‌ల తలలను నరికి, కత్తులతో బంతి ఆట ఆడేవారు. ఇంత క్రూర పాలనను అనుభవించిన దళితులకు పీష్వాలపై విపరీతమైన కోపం, కసి ఉండేవి. శివాజీ పాలనలో మహర్లు సైనికులుగా పనిచేసేవారు. ఆ తర్వాత వచ్చిన బ్రిటీష్సైన్యంలోనూ మహర్లే సైనికులు. 1817లో పీష్వా సైన్యం పుణేలోని బ్రిటీష్ రెసిడెన్సీని ఆక్రమించింది. దీంతో బ్రిటీష్ సైన్యం బొంబాయిలోని తన ఫస్ట్ రెజిమెంట్ రెండో బెటాలియన్‌ను పంపి పీష్వాలకు బుద్ధి చెప్పాలనుకుంది. ఇందులో భాగంగా 500 మంది సైనికులను, 250 మందితో కూడిన అశ్వ దళాలను పంపారు. కానీ పీష్వాలకు 20 వేల సైనికులు, 8 వేల అశ్వ దళం ఉంది. అపార సైనిక బలగం కలిగిన పీష్వా రాజ్యంతో యుద్ధం చేయలేని బ్రిటీష్ వాళ్లు వారితో కలిసి పీష్వా సైన్యంతో యుద్ధానికి రావాలని కోరగా అప్పటి మహర్ నాయకుడు సుబేదార్ శిక్ నాక్ పీష్వా సైన్యాధికారి బాపు గోఖులే వద్దకు వెళ్లాడు. హీనంగా చూస్తున్న తమకు గౌరవంగా బతికే అవకాశం కల్పించాలని కోరారు. యుద్ధం చేసినా, చేయకపోయినా మీకు మేము ఇచ్చే స్థానం ఇంతేనని గోఖులే ఖరాకండిగా చెప్పారు.
పీష్వాల బలానికి జంకని మహర్ సైనికులు
పీష్వాల బలాధిక్యతకు మహర్ సైనికులు జంకలేదు. 1818, జవవరి 1న కోరేగావ్ దగ్గర జరిగిన యుద్ధంలో... ఒక రోజంతా అన్నం, నీళ్లు లేకుండానే మహర్సైనికులు దాదాపు 28 వేల పీష్వా సైన్యంతో తలపడ్డారు. మహర్ సైన్యం సింహాల్లాగా పీష్వా సైన్యాన్ని ఉరికించడాన్ని దూరంగా నిలబడి చూసిన బ్రిటీష్ అధికారి లెఫ్ట్ నెంట్ కల్నల్ ఆశ్చర్యపోయారు. విరామం లేకుండా జరిగిన భీకర యుద్ధంతో భీమా నది పీష్వా సైనికుల రక్తంతో ఎర్రబడింది. పీష్వా సైన్యాధ్యక్షుడి కొడుకైన గోవింద్ బాబా తలను తెగనరికితే ఆ తల లేని కొడుకు మొండాన్ని చూసి ఏడుస్తూ భయంతో అందరూ పారిపోండని ప్రకటించారు. పూల్లావ్ లోని బాజీరావ్ శిబిరం వైపు పీష్వా సైన్యం పారిపోయింది. అమరులైన మహర్ సైనికులకు స్మృతి చిహ్నంగా బ్రిటీష్ వారు స్మారక స్తూపం కట్టించడమే గాకుండా మహర్ సైనికులతో మహర్ రెజ్మెంట్ ఏర్పాటు చేశారు. 1927 జనవరి1న ఈ స్మారక స్తూపాన్ని మొట్టమొదటిసారి సందర్శించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని దళితుల ఆత్మగౌరవ చిహ్నంగా, ఆత్మగౌరవ ప్రతీకగా పేర్కొన్నారు. అంబేద్కర్ సందర్శించిన నాటి నుంచి ప్రతి సంవత్సరం లక్షాలాది మంది దళితులు
జనవరి ఒకటిన భీమా కోరేగావ్ సందర్శనకు వెళ్తారు. ఇప్పటికీ వెళుతున్నారు.
వివక్షను సహించొద్దు..
భీమా కోరేగావ్ యుద్ధం నుంచి దళితులు స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ కల్పించిన ఓటు ద్వారా రాజ్యాధికారం దిశగా ముందుకు సాగాలి. ఫూలే, పెరియార్, అంబేద్కర్ చూపిన మార్గంలో బహుజన రాజ్య నిర్మాణం కోసం కృషి చేయాలి. నేటి పాలకులు దళిత ఉద్యమాలను జాతీయ వ్యతిరేక ఉద్యమాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని చోట్ల వివక్ష కొనసాగుతోంది. విద్య, రాజ్యాధికారం ద్వారా దళితులు విముక్తి దిశగా పోరాటం చేయాలి. యుద్ధం జరిగి రెండు శతాబ్దాలు గడిచినా వారి స్ఫూర్తిని మరిచిపోలేం. నేటి, భవిష్యత్ తరాలకు వారధిగా భీమా కోరేగావ్ విజయ దివస్ సందర్భంగా ఊరూరా సంబరాలు జరపాల్సిన అవసరం ఉంది. మహర్ రెజిమెంట్ పోరాట పటిమను నరనరాన నింపుకుని ప్రభుత్వాలు అవలంబించే దళిత వ్యతిరేక విధానాలపై, సమాజంలో జరిగే అసమానతలపై సమరశంఖం పూరించాలి.
- పిల్లి సుధాకర్, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ మాలమహానాడు