యుద్ధం చేయకుండానే చైనాపై గెలిచినం

ఇండియాకి పాకిస్తానే అతి పెద్ద శత్రువు అని మన దేశంలో ప్రతి ఒక్కరి భావన. వాస్తవానికి దానికంటే పెద్ద శత్రువైన చైనా విషయం ఎవరూ అంతగా పట్టించుకోరు. లడఖ్ సరిహద్దులోని గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ తర్వాత చైనా వల్ల మనకు ఉన్న ముప్పును మనోళ్లు సీరియస్‌‌గా తీసుకోవడం మొదలైంది. అప్పటికి కొన్ని నెలల ముందు నుంచే హిమాలయ ప్రాంతాల్లో చైనా బలగాల మోహరింపు చేస్తూ వచ్చింది. ఇటు సైనిక అధికారులు, అటు విదేశాంగ శాఖ నెలల తరబడి జరిపిన చర్చల తర్వాత, ఇటీవలే చైనా తన బలగాలను వెనక్కి తీసుకోవడం ఇండియా సాధించిన పెద్ద విజయమనే చెప్పాలి. ఒక రకంగా ఎటువంటి పోరాటం చేయకుండానే మోడీ సర్కారు గెలిచిన యుద్ధంగా దీనిని చెప్పొచ్చు.

చైనా దురాక్రమణ బుద్ధి ప్రపంచానికి తెలియంది కాదు. ఏదైనా ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని అనుకుంటే ఒక పథకం ప్రకారం రంగంలోకి దిగుతుంది. అలాగే భారీగా తన ఆర్మీ బలగాలతో గత ఏడాది ఏప్రిల్‌‌లో లడఖ్​సరిహద్దులోని కొన్ని ఏరియాల్లోకి క్యాంపులు వేయించింది. అప్పటి నుంచే రెండు దేశాల మధ్య టెన్షన్స్‌‌కు దారి తీసింది. అయితే ఇండియా బోర్డర్‌‌‌‌లో నుంచి వెనక్కి వెళ్లాల్సి వస్తుందని చైనా కలలో కూడా ఊహించలేదు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ గతంలో నాలుగైదేండ్లు చైనాలో భారత రాయబారిగా పని చేసిన అనుభవం ఈ సమస్యను పరిష్కరించడంలో ఉపయోగపడ్డాయి. పదే పదే కొన్ని రాజకీయ పార్టీలు చైనా విషయంలో మోడీ మౌనం, కేంద్రం ఫెయిల్ అయింది అంటూ కామెంట్లు చేసినా, సైలెంట్‌‌గా ఎన్డీయే ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ సక్సెస్ సాధించింది. చైనా తోక ముడిచేలా చేసింది.

పాక్‌‌ను అడ్డంపెట్టుకుని కుట్రలు

చైనా, పాకిస్తాన్‌‌తో మన దేశానికి దాదాపు సమానమైన సరిహద్దు ఉంది. రెండు దేశాలను కలిపి సుమారు 7 వేల కిలోమీటర్ల బోర్డర్‌‌‌‌ పొడవునా 10 లక్షల మందికి పైగా సైనికులు నిత్యం ఎదురెదురుగా పహారా కాస్తున్నారు. మనకి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి పాకిస్తాన్‌‌నే మన నంబర్ వన్ శత్రువుగా చూస్తున్నాం. కానీ 1962లో ఇండియా – చైనా యుద్ధం జరిగినది మొదలు మన దేశాన్ని వీక్ చేయాలని డ్రాగన్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ ప్రయత్నంలో పాకిస్తాన్‌‌ను అడ్డం పెట్టుకుని టెర్రర్ యాక్టివిటీస్ సహా అనేక రకాలుగా కుట్రలు చేసింది. చేస్తోంది. అయితే 2020 జూన్‌‌‌‌ 15 నుంచి చైనా నుంచి మన దేశానికి ఎదురవుతున్న ముప్పు గురించి ఇండియన్లందరికీ తెలిసింది. 2020 జూన్‌‌‌‌లో జరిగిన గాల్వన్‌‌‌‌ ఎటాక్‌‌‌‌ దగ్గర నుంచి ఇండియన్ల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది. చైనానే మనకు అతి పెద్ద శత్రువని ఇప్పుడు వారంతా భావిస్తున్నారు.

దురాక్రమణ బుద్ధి మార్చుకోని చైనా

వాస్తవానికి 1951లో మనకు పొరుగు దేశమైన టిబెట్‌‌ను చైనా ఆక్రమించింది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇండియా, టిబెట్‌‌‌‌ పొరుగు దేశాలుగా ఉన్నాయి. అయితే టిబెట్‌‌‌‌ను ఆక్రమించుకున్న తర్వాత ఇండియాతో సరిహద్దులకు సంబంధించిన డిమాండ్లను లేవనెత్తడం మొదలుపెట్టింది చైనా. 1987లో చైనాను సందర్శించిన అప్పటి ప్రధానమంత్రి రాజీవ్‌‌‌‌గాంధీ, సరిహద్దుల్లో శాంతి కొనసాగాలని ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 50‌‌‌‌ ఏండ్ల తర్వాత బార్డర్‌‌‌‌ ఇష్యూ పరిష్కారమవుతుందని, ఎందుకంటే అప్పటికీ ఇరు దేశాల మధ్యా వివాదాలు సమసిపోతాయని అప్పటి చైనీస్‌‌‌‌ లీడర్‌‌‌‌ డెంగ్‌‌‌‌ హియో పింగ్‌‌‌‌ చెప్పారు. ఆ ప్రకటనను ఇండియన్లంతా నమ్మారు. కానీ చైనా మళ్లీ ఇండియాను మోసగించింది.

యుద్ధానికైనా సిద్ధమన్న సిగ్నల్స్ ఇచ్చినం

సరిహద్దు, భూమి, సముద్రానికి సంబంధించి 20 దేశాలతో చైనాకు వివాదాలు ఉన్నాయి. 1962 నుంచి ఇండియా, చైనా మధ్య యుద్ధాలు, కవ్వింపు చర్యలు, టెన్షన్లు కొనసాగుతున్నాయి. ఇండియాను విడదీసేందుకు, దేశంలో విధ్వంసాలను రెచ్చగొట్టేందుకు ఎప్పటి నుంచో చైనా ప్రయత్నిస్తోంది. ఇందు కోసం నార్త్‌‌‌‌ఈస్ట్‌‌‌‌లో తిరుగుబాటుదారులను ప్రోత్సహిస్తోంది. కొన్ని చోట్ల మావోయిస్టులకు సపోర్ట్‌‌‌‌ చేస్తూ వస్తోంది. దాదాపు 40 ఏండ్ల తర్వాత 2020 జూన్‌‌‌‌ లో మళ్లీ ఇండియా, చైనా మధ్య యుద్ధం లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. హిమాలయాల్లో భారీగా సైన్యాన్ని మోహరిస్తే ఇండియా వెనక్కి తగ్గుతుందనే అభిప్రాయంలో చైనా ఉంది. కానీ యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నట్లు ఇండియా ప్రకటించడం, ఓటమితో సహా ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు రెడీ కావడంతో చైనా వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

చైనాను ఎదుర్కోవడంలో ఎదురయ్యే సవాళ్లు

ఇండియా ఒక ప్రజాస్వామ్య దేశం. ఇక్కడి ప్రజలకు సంక్షేమ పథకాలు మాత్రమే కావాలి. ప్రభుత్వాలు కూడా వాటినే అమలు చేస్తున్నాయి. దీంతో జనాలకు చైనా నుంచి ఎదురయ్యే ముప్పు గురించి పెద్దగా అవగాహన లేదు. ఇండియాను ముక్కలు చేయాలని, దాని సామర్థ్యాన్ని తగ్గించాలని, ఎప్పుడూ ఏదో ఒక పొలిటికల్‌‌‌‌ గొడవలు జరుగుతూ ఉండాలని చైనా కోరుకుంటోంది. చైనా వివాదాల ద్వారా తాను బలపడి కావాల్సినది సాధించుకోవాలని, లేదా తాను ఎదుర్కొనే దేశం అలసిపోవాలని కోరుకుంటుందనే విషయాన్ని మనం గుర్తించాలి. వేలాది సంవత్సరాల చైనా చరిత్ర ఇదే చెబుతోంది. ఫారిన్‌‌‌‌ కంట్రీస్‌‌‌‌లో లీడర్లు మారుతుంటారు కానీ, అదే సిస్టం కంటిన్యూ అవుతుందని చైనా అనుకుంటోంది. గతంలో చైనా చక్రవర్తులు వేలాది సంవత్సరాల క్రితం ఎలాంటి పద్ధతులు అనుసరించారో ఇప్పుడు చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా అదే దారిలో అడుగులు వేస్తోంది.

ప్రతిసారి ఇదే రిపీట్‌‌‌‌ కాదు

యుద్ధం చేయకుండా గెలవడమే గొప్ప విజయమని వార్‌‌‌‌ హిస్టారియన్స్‌‌‌‌ చెబుతూ ఉంటారు. ఒకవేళ ఏదైనా దేశంలో యుద్ధాలు చేస్తూ, అందులో విజయాలు సాధిస్తున్నట్లయితే అది చాలా ఖరీదైపోతుంది. కానీ, ప్రస్తుతం ఇండియా ఎలాంటి యుద్ధం చేయకుండానే గెలుపొందింది. అయితే ప్రతిసారి అదే పరిస్థితి రిపీట్‌‌‌‌ అవుతుందని చెప్పలేం. ఇండియాకు హిమాలయాలు చాలా కీలకమైనవి. ఎందుకంటే మన చరిత్ర, సంప్రదాయం, జ్ఞాపకాలు, మతాలు కూడా దానితో ముడిపడి ఉన్నాయి. ఇది ఇండియా నీటిని నిల్వ చేసుకునే గొప్ప స్థలం కూడా. పాకిస్తాన్‌‌‌‌ రూపంలో మనకు ఓ పర్మినెంట్‌‌‌‌ శత్రువు ఉంది. చైనాతో శాంతిని సాధించినట్లయితే, అది పాకిస్తాన్‌‌‌‌ను బలహీనపరుస్తుంది. ఏది ఏమైనా చైనా, పాకిస్తాన్‌‌‌‌తో ఏకకాలంలో యుద్ధం వచ్చినా ఎదుర్కొనేందుకు ఇండియా సిద్ధంగా ఉండాలి. లేదా చైనాతో ఓ ఒప్పందానికి వచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి. అలాగే చైనాతో యుద్ధానికి మనం సిద్ధమై ఉండాలి. ఎందుకంటే చైనా ఇప్పుడు మన నంబర్‌‌‌‌ వన్‌‌‌‌ ఎనిమి కాబట్టి.

జాతీయవాదం రగలాలి

చైనా ప్రజలకు జాతీయవాదంపై ఎంతో గౌరవం ఉంటుంది. ఇండియాలో కూడా అలాంటి స్ఫూర్తి రావాల్సిన అవసరం ఉంది. అందువల్ల ప్రభుత్వం, పార్టీలు చైనా నుంచి మన ఉనికికి ఎదురయ్యే ముప్పు గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి. అంతే కాదు చైనా విషయంలో మనం ఎప్పటికీ నిద్ర మత్తులోకి జారుకోకూడదు. బలం, తెలివితేటలు, సహనం ద్వారా చైనాను ఎదుర్కోవడాన్ని ఇండియా నేర్చుకోవాలి. చైనా, పాకిస్తాన్‌‌‌‌ మనకు అత్యంత ప్రమాదకరమైన శత్రు దేశాలు. వారి వల్ల మనం రక్షణ బడ్జెట్‌‌‌‌ను భారీగా పెంచుకోవాల్సి వస్తోంది. దీంతో మిగతా రంగాలపై ప్రభావం పడుతోంది. ప్రస్తుతం ఇండియా నుంచి చైనాకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, కొరియా, ఇండియన్‌‌‌‌ ఓషన్‌‌‌‌ కంట్రీలు ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాయి. చైనాను ఇలాగే కంట్రోల్‌‌‌‌ చేయాలని అవి భావిస్తున్నాయి. కానీ, ఇండియా దుందుడుకుగా వ్యవహరించకూడదు. సరిహద్దు సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలని చైనా దగ్గర ఇండియా పట్టుబట్టాలి. మ్యాప్‌‌‌‌లను చూపించడంలో, సమస్యను పరిష్కరించడంలో ఆలస్యం చేస్తోంది చైనానే. అయితే ఇండియాను ఇబ్బంది పెట్టడం పొరపాటు అని, ఇండియాకు సహనం నశించిందని ఇప్పటికే
చైనాకు తెలిసింది.

– పెంటపాటి పుల్లారావు, పొలిటికల్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌