వెంకటేష్ హీరోగా నటించిన 75వ సినిమా సైంధవ్. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మించిన చిత్రం జనవరి 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం విశాఖపట్నంలో ప్రీ రిలీజ్‌ను ఈవెంట్ నిర్వహించారు. వెంకటేష్ మాట్లాడుతూ ‘నా మొదటి సినిమా నుంచి ఫ్యాన్స్ నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఇది నా 75వ మూవీ. ఎమోషనల్, యాక్షన్ న్యూ ఏజ్ థ్రిల్లర్. యాక్షన్ చాలా కొత్తగా చేశా. ప్రతి ఒక్కరూ చూసేలా ఈ సినిమా ఉంటుంది. చాలామంది ఆడవాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటారు. అంతలా ఎమోషన్ పండింది. డైలాగ్స్ కూడా అందర్నీ అలరిస్తాయి. ఈ సంక్రాంతి పండగే పండగే’ అని అన్నారు.
ఈ సినిమా అందరి హృదయాలను గెలుచుకుంటుంది అని చెప్పింది హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. ‘ఇందులో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది’ అంది రుహాని శర్మ. శైలేష్ కొలను మాట్లాడుతూ ‘బ్యూటీఫుల్ ఇంటెన్స్ డ్రామా ఇది. వెంకటేష్ గారిని ఎప్పుడూ చూడని విధంగా ఇందులో చూస్తారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు. ‘వెంకటేష్ గారికి నేను అభిమానిని. ఆయనతో సినిమా తీయడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు మైల్ స్టోన్ మూవీ’ అని చెప్పారు నిర్మాత వెంకట్ బోయనపల్లి. నటులు నవాజుద్దీన్ సిద్ధిఖీ, బేబీ సారా, లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి సహా టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.