వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన ‘సంక్రాంతి వస్తున్నాం’ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా పొంగల్ బ్లాక్ బస్టర్ జాతర సెలబ్రేషన్స్ పేరుతో ఈవెంట్ నిర్వహించారు.
హీరో వెంకటేష్ మాట్లాడుతూ ‘నా కెరీర్‌లో ఇదొక హ్యాపీయస్ట్ మూమెంట్. కష్టపడి పని చేస్తే ఫలితం వస్తుందని నేను నమ్ముతాను. ఆ నమ్మకాన్ని ఈ విజయం మరోసారి రుజువు చేసింది. ఇది మా విజయమే కాదు.. తెలుగు ప్రేక్షకుల విజయం. మనస్పూర్తిగా వాళ్లకు థ్యాంక్స్. డైరెక్టర్ అనిల్, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, సినిమా యూనిట్ అందరికీ పేరుపేరునా థాంక్ యూ’ అన్నారు.
తాను పోషించిన భాగ్యం పాత్ర బాగా రావడంలో క్రెడిట్ అంతా దర్శకుడికే దక్కుతుందని ఐశ్వర్య చెప్పింది.
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘‘మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయికి తీసుకెళ్లిన ప్రేక్షకులకు పాదాభివందనాలు. వెంకటేష్ గారు నా కంటే ఎక్కువ ఎనర్జీతో పని చేశారు. ఇది మా హ్యాట్రిక్ మూవీ. భాగ్యం క్యారెక్టర్‌ను ఐశ్వర్య నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్ళింది. మీనాక్షి కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. బుల్లిరాజు పాత్రని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. భీమ్స్ క్రియేట్ చేసిన సాంగ్స్ ఈ సక్సెస్‌లో పెద్ద ఎసెట్. టెక్నికల్ టీమ్ అందరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు.
‘ఇది మాకు బ్లాక్ బస్టర్ పొంగల్. ఈ సంక్రాంతిని మర్చిపోలేం. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’ అని దిల్ రాజు అన్నారు. నిర్మాత శిరీష్ మాట్లాడుతూ ‘ఈ సినిమా మా ప్రాబ్లమ్స్ అన్నీ తీరుస్తుందని షూటింగ్‌లోనే అనిల్ చెప్పేవారు. ఆ మాట నిజమైంది’ అని చెప్పారు.
నటులు అవసరాల శ్రీనివాస్, మురళీధర్ గౌడ్, శ్రీనివాస్ వడ్లమాని, పమ్మి సాయి, మాస్టర్ రేవంత్, డీవోపీ సమీర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్, ఎడిటర్ తమ్మిరాజు, రచయితలు అజ్జు మహాకాళి, నాగ్, సాయి కృష్ణ పాల్గొన్నారు.