
నాగ్‌పూర్: రంజీ ట్రోఫీలో మరోసారి విజేతగా నిలవాలని ఆశిస్తున్న విదర్భ అందుకు కీలక ముందడుగు వేసింది. కేరళతో ఫైనల్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకొని పటిష్ట స్థితిలోనిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 131/3తో శుక్రవారం, మూడో రోజు ఆట కొనసాగించిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 125 ఓవర్లలో 342 రన్స్‌కు ఆలౌటైంది. దాంతో విదర్భకు 37 రన్స్ ఆధిక్యం లభించింది. కెప్టెన్ సచిన్ బేబీ (98), ఆదిత్య సర్వాటే (79) పోరాడినా కేరళను ఆధిక్యంలోకి తీసుకురాలేకపోయారు.
అహ్మద్ ఇమ్రాన్ (37), మహ్మద్ అజారుద్దీన్ (34), జలజ్ సక్సేనా (28), సల్మాన్ నిజార్ (21) కూడా పోరాడారు. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కాండే, హర్ష్ దూబే, పార్థ్ రేఖడే తలో మూడు వికెట్లు పడగొట్టి కేరళను ఆలౌట్ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో విదర్భ 379 రన్స్‌కు ఆలౌటైన సంగతి తెలిసింది. మ్యాచ్‌లో మరో రెండు రోజుల ఆట మిగిలుంది. ఒకవేళ ఫైనల్ డ్రాగా ముగిస్తే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా విదర్భ ట్రోఫీ కైవసం చేసుకుంటుంది.
హర్ష్ దూబే కొత్త చరిత్ర
రంజీ ట్రోఫీలో ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా విదర్భ స్పిన్నర్ హర్ష్ దూబే చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన 22 ఏండ్ల హర్ష్ సీజన్‌లో మొత్తంగా 69 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. దాంతో బీహార్‌కు చెందిన అషుతోష్ అమన్ 2018–19 సీజన్‌లో అత్యధికంగా 68 వికెట్లు పడగొట్టి సృష్టించిన రికార్డును హర్ష్ బ్రేక్ చేశాడు.