ముంబై: రంజీ ట్రోఫీలో ముంబై 42వ ట్రోఫీని గెలుచుకునేందుకు బాటలు వేసుకున్నా.. ఫైనల్లో ఆ జట్టుకు విదర్భ గట్టి పోటీ ఇస్తోంది. కరుణ్ నాయర్ (220 బాల్స్‌లో 3 ఫోర్లతో 74), కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (91 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 56 బ్యాటింగ్) మ్యాచ్‌ను చివరి రోజుకు తీసుకెళ్లారు. ముంబై ఇచ్చిన 538 రన్స్ భారీ టార్గెట్ ఛేజింగ్‌లో బుధవారం, నాలుగో రోజు చివరకు విదర్భ 248/5 స్కోరుతో నిలిచింది.
ప్రస్తుతం అక్షయ్‌కు తోడు హర్ష్ దూబే (11 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఆ జట్టు విజయానికి చివరి రోజు 290 రన్స్ అవసరం కాగా... ముంబై గెలుపునకు ఐదు వికెట్లు కావాలి. మ్యాచ్ డ్రా అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ముంబై ట్రోఫీ చేజిక్కించుకుంటుంది. కాగా, ఓవర్‌నైట్ స్కోరు 10/0తో విదర్భ రెండో ఇన్నింగ్స్ కొనసాగించగా ఓపెనర్లు అథర్వ (32), ధ్రువ్ షోరే (28) తొలి వికెట్‌కు 64 రన్స్ జోడించి మంచి ఆరంభమే ఇచ్చారు.
అథర్వను ములానీ, షోరేను తనుష్ వెంటవెంటనే ఔట్ చేయడంతో ముంబైకి బ్రేక్ లభించింది. ఈ దశలో కరుణ్ నాయర్ క్రీజులో పాతుకుపోయాడు. అమన్ మోఖడే (32)తో మూడో వికెట్‌కు 162 బాల్స్‌లో 54 రన్స్ జోడించాడు. ముంబై బౌలర్లు 15 రన్స్ తేడాతో అమన్, యశ్ రాథోడ్ (7)ను వికెట్లు తీసినా కరుణ్‌కు కెప్టెన్ అక్షయ్ తోడయ్యాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 90 రన్స్ జోడించారు. అయితే, చివర్లో కరుణ్‌ను ఔట్ చేసిన ముషీర్ ముంబై పైచేయి సాధించేలా చేశాడు.