పీహెచ్‌‌‌‌సీ నుంచే పెద్ద డాక్టర్‌‌‌‌కు చూపెట్టుకోవచ్చు

సర్కారు దవాఖాన్లలో వీడియో కన్సల్టేషన్​

స్పెషలిస్టుల కొరతను అధిగమించేందుకు హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ నిర్ణయం

సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు సక్సెస్

రాష్ట్రమంతటా విస్తరించేందుకు ప్రపోజల్స్

హైదరాబాద్, వెలుగు: ప్రైమరీ హెల్త్‌‌‌‌ కేర్‌‌‌‌ సెంటర్‌‌‌‌ (పీహెచ్‌‌‌‌సీ) నుంచే పెద్ద డాక్టర్‌‌‌‌కు చూపెట్టుకునే సౌకర్యాన్ని హెల్త్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకొస్తోంది. ప్రభుత్వ దవాఖాన్లలోని స్పెషలిస్టుల కొరతను అధిగమించేందుకు వీడియో కన్సల్టేషన్‌‌ ద్వారా అవుట్‌‌‌‌ పేషెంట్ సేవలు అందించాలని నిర్ణయించింది. నెల క్రితం సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లోని అన్ని దవాఖాన్లలో పైలట్‌‌‌‌గా స్టార్ట్‌‌‌‌ చేసిన కార్యక్రమం సక్సెస్ కావడంతో రాష్ర్టమంతటా అమలు చేసేందుకు ప్రపోజల్స్‌‌‌‌ సిద్ధం చేసింది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కలిసి ఈ ప్రాజెక్టు కోసం నిధులు కేటాయించనున్నాయి.

హైదరాబాద్‌‌‌‌కే ‘స్పెషల్‌‌‌‌’ సేవలు పరిమితం

రాష్ర్టంలో ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లోని హాస్పిటల్స్‌‌‌‌, కొన్ని ఏరియా హాస్పిటళ్లలోనే స్పెషలిస్టులు ఉన్నారు. కార్డియాలజీ, ఆంకాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ సేవలు హైదరాబాద్‌‌‌‌కే పరిమితమయ్యాయి. సర్కారు ఇచ్చే జీతాలకు సూపర్ స్పెషలిస్టులు, స్పెషలిస్టులు రూరల్‌‌‌‌లో పని చేసేందుకు ఇష్టపడట్లేదు. దీంతో వీడియో కన్సల్టెన్సీ ద్వారా రూరల్‌‌‌‌ పేషెంట్లకు స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. నేషనల్ హెల్త్ మిషన్‌‌‌‌ కింద ఈ ప్రాజెక్టుకు కేంద్ర సర్కారు నిధులిస్తోంది. సెంట్రల్ హెల్త్ మినిస్ర్టీకి ప్రపోజల్స్‌‌‌‌ సమర్పించేందుకు ఈ నెల 26న రాష్ర్ట అధికారులు ఢిల్లీ వెళ్తున్నారు.

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే చూడటం.. మందులివ్వడం

రాష్ర్టంలోని ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్‌‌‌‌, కమ్యునిటీ హెల్త్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీడియో కన్సల్టెన్సీకి అవసరమైన మానిటర్లు, ఇంటర్నెట్, ఇతర సౌకర్యాలను సమకూర్చనున్నారు. ఒక్కో రోజు ఒక్కో స్పెషాలిటీకి సంబంధించిన స్పెషలిస్టులను, సూపర్ స్పెషలిస్టులను  వీడియో కన్సల్టెన్సీ కోసం కేటాయిస్తారు. పీహెచ్‌‌‌‌సీలు, సీహెచ్‌‌‌‌సీల్లోని మెడికల్ ఆఫీసర్లు  పేషెంట్లలో ఎవరికైనా స్పెషాలిటీ వైద్య సేవలు అవసరమని భావిస్తే సంబంధిత స్పెషలిస్టు అందుబాటులో ఉండే రోజు రావాలని సూచిస్తారు. హైదరాబాద్‌‌‌‌, జిల్లా కేంద్రాల్లో ఉండే పెద్ద డాక్టర్లు.. అక్కడి నుంచే గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌‌‌‌సీ లేదా కమ్యునిటీ హెల్త్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న పేషెంట్లతో మాట్లాడతారు. వాళ్ల సమస్యను తెలుసుకుని సూచనలు చేస్తారు.

పేషెంట్లకు టైమ్‌‌, ఖర్చు ఆదా

వీడియో ఓపీ సేవలతో పేషెంట్లకు ప్రయాణ ఖర్చులు, టైమ్ ఆదా అవుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. డిస్ర్టిక్ట్ హాస్పిటళ్లు, గాంధీ, ఉస్మానియా వంటి పెద్ద దవాఖాన్లపై రోగుల భారం తగ్గుతుందంటున్నారు.  సిరిసిల్ల, మెదక్‌‌‌‌లో ఇప్పటికే వందల మంది వీసీ సేవలను వినియోగించుకున్నారు.  గవర్నమెంట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో‌‌‌‌ సూపర్ స్పెషలిస్టులు తక్కువగా ఉండటం, ప్రైవేట్‌‌‌‌లో ఓపీ కన్సల్టెన్సీకే రూ. 1,200 వరకు వసూలు చేస్తుండటంతో వీసీకి పేషెంట్ల నుంచి మంచి రెస్పాన్స్‌‌‌‌ వస్తోందని డాక్టర్లు చెబుతున్నారు.

త్వరలో జిల్లాల్లో డయాగ్నస్టిక్‌‌‌‌ సెంటర్లు

పేషెంట్లకు టెస్టులు అవసరమైతే సర్కారు డయాగ్నస్టిక్ సెంటర్లలోనే టెస్టులు చేసి రిపోర్టులను వెబ్‌‌‌‌ పోర్టల్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్ చేస్తారు. ఇందుకోసం అన్ని జిల్లాల్లో డయాగ్నస్టిక్ హబ్స్‌‌‌‌ను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌‌‌‌లో ఇటీవలే 8 సెంటర్లను ప్రారంభించారు. ఫిబ్రవరిలో జిల్లాల్లో 20 సెంటర్లను ప్రారంభించే చాన్స్ ఉంది. ఈ సెంటర్లు అప్‌‌‌‌లోడ్ చేసిన రిపోర్టులను సంబంధిత డాక్టర్ పోర్టల్‌‌‌‌లో చూడొచ్చు. ఇందుకోసం ప్రతి డాక్టర్‌‌‌‌‌‌‌‌కు యూజర్ ఐడీ, పాస్‌‌‌‌వర్డ్ ఇస్తారు. సమస్యను బట్టి మెడిసిన్‌‌‌‌ను డాక్టర్లు ప్రిస్ర్కైబ్ చేస్తారు. సర్జరీలు, ఇతర ఫిజికల్ ప్రొసీజర్లు అవసరమైతే పెద్ద హాస్పిటల్‌‌‌‌కు రావాలని రిఫర్ చేస్తారు.

ఇవి కూడా చదవండి..

ప్రాణహిత ప్రవాహం తగ్గింది.. యాసంగికి నీళ్లెట్ల..?

పనిచేయకున్నా జీతాలు చెల్లింపు.. ఆపై ప్రమోషన్‌తో బదిలీ

గుహలో భారీగా బంగారం నిల్వలు.. కళ్ల ముందే హింట్ ఉన్నా తెరవలేకపోతున్నారు