10ఏళ్ల బాలికను పని మనిషిగా పెట్టుకుని కొట్టారు.. జైలు పాలయ్యారు

10ఏళ్ల బాలికను పని మనిషిగా పెట్టుకుని కొట్టారు.. జైలు పాలయ్యారు

ఢిల్లీలోని ద్వారకలో 10 ఏళ్ల బాలికను ఇంటి పనిమనిషిగా పెట్టుకుని చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణతో పైలట్‌తో పాటు ఆమె భర్తను చితకబాదారు. ఈ సంఘటనకు సంబంధించిన కొన్ని షాకింగ్ విజువల్స్‌ లీక్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో పైలట్ యూనిఫాంలో ఉన్న మహిళను కొందరు చెప్పుతో కొట్టడం కనిపిస్తోంది. ఆమె జుట్టు పట్టుకుని లాగి అనేక మంది మహిళలు కూడా ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఒకానొక సమయంలో ఆమె "క్షమించండి" అని అరవడం ప్రారంభించినా.. వారు మాత్రం దాడిని కొనసాగించారు.

ఆమె భర్తపైనా కొందరు వ్యక్తులు దాడి చేయడం ఈ క్లిప్పింగ్ లో చూడవచ్చు. గుంపు దాడిని ఆపడానికి కొంతమంది జోక్యం చేసుకోవడంతో అతను తన భార్యను రక్షించడానికి ప్రయత్నించాడు. ఒక వ్యక్తి "ఆమె చచ్చిపోతుంది" అని అరుస్తున్నట్లు కూడా ఈ వీడియోలో వినిపిస్తోంది.

ఈ దంపతులు రెండు నెలల క్రితం ఇంటి పనుల కోసం 10 ఏళ్ల బాలికను పనికి పెట్టుకున్నట్టు సమాచారం. ఓ రోజు ఆ బాలిక బంధువు.. ఆమె చేతులపై గాయాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెల్లడైంది. అంతలోనే స్థానికులు కూడా... వారు ఆ అమ్మాయిని చిత్రహింసలకు గురిచేస్తారన, ఆమెను కొట్టారని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో బాలిక చేతులపై, కళ్ల కింద గాయాల గుర్తులు కనిపించడంతో ఓ గుంపు గుమిగూడి దంపతులపై దాడికి దిగింది. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

మామూలుగా అయితే పిల్లలను ఇంటి పనిమనుషులు నియమించుకోవడం భారతదేశంలో చాలా కాలం కిందే నిషేధించారు. అయినప్పటికీ చాలా మంది ఇప్పటికీ ఈ నియమాన్ని ఉల్లంఘిస్తున్నారు.

ద్వారకకు చెందిన సీనియర్ పోలీసు అధికారి ఎం హర్ష వర్ధన్ కూడా బాలిక చేతులపై కాలిన గాయాలను గుర్తించారు. "వైద్య పరీక్ష చేసి, ఆమెకు కౌన్సెలింగ్ కూడా అందిస్తాం. ఆమె వాంగ్మూలం ఆధారంగా, మేము బాల కార్మిక (నిషేధం, నియంత్రణ) చట్టం, జువెనైల్ జస్టిస్ (కేర్, పిల్లల రక్షణ) చట్టం ప్రకారం చర్య తీసుకుంటామ"ని చెప్పారు.