బీజింగ్: చైనా ఫోన్లను, వస్తువులను నమ్మకూడదని వింటుంటాం. తాజాగా అక్కడి టూరిస్టు ప్లేసులనూ నమ్మొద్దని ఈ ఉదంతం నిరూపించింది. చైనా ఏకంగా నకిలీ జలపాతాన్నే క్రియేట్ చేసింది. ఏండ్లుగా దాన్ని అడవిలో కొండల మధ్య ప్రకృతి సృష్టించిన జలపాతంగా టూరిస్టులను నమ్మిస్తూ మోసం చేసింది. హెనాన్ ప్రాంతంలో ని యుంటాయ్ మౌంటైన్ పార్క్లో ప్రసిద్ధ పర్యాటక వాటర్ ఫాల్ యుంటాయ్ (1,024 అడుగులు) చైనాలోనే ఎత్తయిన జలపాతంగా పేరొందింది.
దాన్ని చూసి రిలాక్స్ అయ్యేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది టూరిస్టులు వెళుతుంటారు. అయితే..ఇటీవల దానిపైకి ఎక్కిన ఓ పర్వతారోహకుడు అక్కడి పరిస్థితిని చూసి షాక్ అయ్యాడు. ఆకాశం నుంచి జారిపడుతున్నట్లుగా కనిపించే వాటర్ ఫాల్ నిజమైనది కాదని తెలిసి నివ్వెరపోయాడు. ఎందుకంటే అక్కడ ఓ పెద్ద పైపు ద్వారా నీటిని కిందికి వదులుతూ కృత్రిమ జలపాతాన్ని ఏర్పాటు చేశారు.
ఎత్తయిన కొండల మీద ఏర్పాటు చేసిన పైపు నుంచి నీరు కిందకు పడుతున్న ఫేక్ జలపాతాన్ని ఆ పర్వతారోహకుడు వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది.
నెటిజన్ల మండిపాటు
యుంటాయ్ ఫేక్ వాటర్ ఫాల్ అని తెలియడంతో నెటిజన్లు చైనాపై మండిపడుతున్నారు. చైనా వస్తువులే కాదు, టూరిస్టు స్పాట్లు కూడా నకిలీవేనా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ ..'ఇంతకాలం టూరిస్టులు తాము ఒక సహజ అద్భుతాన్ని చూస్తున్నామనే భావనలో ఉన్నారు. కానీ, ఆ జలపాతం పైపుల ద్వారా సృష్టించిందని ఇప్పుడే అర్థమైంది' అంటూ అసహనం వ్యక్తంచేశారు.
'నకిలీకి ఎటువంటి పరిమితులు లేవని చైనా మరోసారి నిరూపించింది' అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో స్థానిక అధికారులు యుంటాయ్ మౌంటైన్ పార్క్ నిర్వాహకులను నిలదీశారు. వర్షాలు తక్కువగా ఉండటం, వేసవిలో నీటి ఎద్దడి వల్లే ఇలా చేస్తున్నామని వివరించారు.