- ఖమ్మంలో వీడియో గ్రాఫర్ల ఆందోళన
ఖమ్మం టౌన్, వెలుగు : ఎన్నికల విధుల్లో భాగంగా పని చేసిన తమకు జీతాలు చెల్లించాలని వీడియో గ్రాఫర్లు అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం 21 మండలాల వీడియో గ్రాఫర్లు ఖమ్మం ఐడీఓసీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వీడియో గ్రాఫర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వి.నాగరాజు దేవర మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యి 20 రోజులు గడుస్తున్నా అధికారులు తమ జీతాలను చెల్లించకపోవడం సరికాదన్నారు.
ఎలక్షన్ కోడ్ వెలువడిన నాటి నుంచి చెక్ పోస్టుల్లో, ప్రచారం, ర్యాలీలు, పోలింగ్, కౌంటింగ్ వద్ద ఎలక్షన్ ఆఫీసర్ల సూచన మేరకు వీడియో గ్రాఫర్లు పని చేశారని తెలిపారు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ఇచ్చిన హామీ మేరకు ఎనిమిది గంటల షిఫ్ట్ కు రూ.15 వందల చొప్పున వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
లేకపోతే కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కమటం రఘు, వీరన్న గౌడ్, బాలాజీ, రామారావు, స్వామి, రాము, కనకా చారి, శ్రీకాంత్, యాసిన్, జగదీశ్, రామ్మూర్తి 21 మండలాల వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.