పగలు మెక్డొనాల్డ్స్ జాబ్.. రాత్రి రన్నింగ్ ప్రాక్టీస్

పగలు మెక్డొనాల్డ్స్ జాబ్.. రాత్రి రన్నింగ్ ప్రాక్టీస్

నోయిడా: అర్ధరాత్రి రోడ్డు మీద అలుపెరగకుండా ఓ యువకుడు పరిగెడుతున్నాడు. ఎందుకలా పరిగెడుతున్నావని అడిగితే.. అతడు చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యపోవాల్సిందే. మెక్‌డొనాల్డ్‌ రెస్టారెంట్ లో పనిచేస్తున్న ఆ యువకుడి పేరు ప్రదీప్ మెహ్రా. తన షిఫ్ట్ ముగిసిన తర్వాత ప్రదీప్ ఇంటికి  పరిగెడుతూ వెళ్తున్నాడు. లిఫ్ట్ ఇస్తానని సినీ దర్శకుడు వినోద్ కప్రీ ఆఫర్ చేస్తే.. పరిగెత్తడానికి తనకు దొరికే సమయం ఇదొక్కటేనని, రన్నింగ్ తనకు ఇష్టమైన వ్యాపకం అని సున్నితంగా తిరస్కరించాడు. ఇంత అర్థరాత్రి ఎందుకు పరిగెత్తుతున్నావని అడిగితే.. తనకు సైన్యంలో చేరాలని ఉందని బదులిచ్చాడు. ప్రాక్టీస్ లో భాగంగా ఇలా పరిగెడుతున్నానని చెప్పాడు. ఉదయం పరిగెత్తొచ్చు కదా అంటే.. డ్యూటీకి పొద్దున్నే వెళ్లాలని టైం దొరకదని తెలిపాడు. 

19 ఏళ్ల ప్రదీప్ మెహ్రా ధైర్యం, నవ్వుతూ కష్టాన్ని అధిగమిస్తున్న తీరు.. దేశ సరిహద్దుల్లో పహారా కాసే సైన్యంలో చేరాలనే కోరిక అందరికీ స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. ఈ వీడియోను వినోద్ కప్రీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. పోస్ట్ చేసిన నిమిషాల్లోనే వేలాది మంది ఈ వీడియోను చూశారు. ఆ కుర్రాడి మీద ప్రశంసల జల్లులు కురిపించారు. ఇకపోతే, ఉత్తరాఖండ్‌కు చెందిన మెహ్రా.. నోయిడాలోని సెక్టార్ 16లో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడి నుంచి బరోలాలోని తన ఇంటి వరకు ప్రతిరోజూ పది కిలోమీటర్ల దూరం పరిగెడతాడు. అక్కడ సోదరుడితో కలసి ఉంటున్నాడు. అతడి తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉందని తెలిపాడు.

 

 

మరిన్ని వార్తల కోసం:

జూనియర్ ఎన్టీఆర్ కారుకు బ్లాక్ ఫిలిం తొలగింపు

ఉక్రెయిన్​తో వార్ లో రష్యాకు ఎదురుదెబ్బలు