వడోదరా: ధ్రువ్ షోరే (114), యష్ రాథోడ్ (116) సెంచరీలతో దుమ్మురేపడంతో విదర్భ జట్టు.. విజయ్ హజారే ట్రోఫీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీస్‌లో విదర్భ 69 రన్స్ తేడాతో మహారాష్ట్రపై నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విదర్భ 50 ఓవర్లలో 380/3 స్కోరు చేసింది. ధ్రువ్, యష్ తొలి వికెట్‌కు 224 రన్స్ జోడించి అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. కెప్టెన్ కరుణ్ నాయర్ (88 నాటౌట్), జితేశ్ శర్మ (51 నాటౌట్) కూడా బ్యాట్లు ఝుళిపించారు.
ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 93 రన్స్ జోడించారు. ముకేశ్ చౌదరి రెండు వికెట్లు తీశాడు. తర్వాత మహారాష్ట్ర 50 ఓవర్లలో 311/7 స్కోరుకే పరిమితమైంది. అర్షిన్ కులకర్ణి (90) టాప్ స్కోరర్. అంకిత్ బావ్నే (50), నిఖిల్ నాయక్ (49), సిద్ధేశ్ వీర్ (30) పోరాడినా ప్రయోజనం దక్కలేదు. దర్శన్ నల్కండే, నచికేత్ చెరో మూడు వికెట్లు తీశారు. యష్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. శనివారం జరిగే ఫైనల్లో విదర్భ.. కర్నాటకతో తలపడుతుంది.