విద్యా హెర్బల్ స్పైస్ ఫ్యాక్టరీ మూసేయాలని ధర్నా

మరిపెడ, వెలుగు: గ్రామానికి సమీపంలో ఉన్న ఫ్యాక్టరీ నుంచి విషవాయువులు వెలువడి ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని, ఫ్యాక్టరీని వెంటనే మూసేయాలని గ్రామస్తులు ధర్నా చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటుచేసిన విద్యా హెర్బల్ స్పైస్ ఫ్యాక్టరీలో ఎండుమిర్చి ప్రాసెస్ చేసి ఆయిల్ విదేశాలకు ఎక్స్​పోర్ట్​ చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఫ్యాక్టరీ నుంచి వెలువడిన విషవాయువుల కారణంగా ఫ్యాక్టరీ చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల పరిధిలో గాలి కలుషితమై గ్రామస్తులకు ఒంటి మీద మంటలు, శ్వాస సమస్యలు ఏర్పడడంతో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో వేస్ట్ వాటర్, విష వాయువులు రిలీజ్ చేస్తున్న ఫ్యాక్టరీని మూసేయాలని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యాజమాన్యంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని, అప్పటివరకు ఫ్యాక్టరీ బంద్ చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.