అక్కడ ఎన్నికలు.. ఇక్కడ అలర్ట్

అక్కడ ఎన్నికలు.. ఇక్కడ అలర్ట్
  •  మహారాష్ట్రలో ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అధికారుల అప్రమత్తం
  •  బార్డర్లలో చెక్​పోస్టుల ఏర్పాటు, ముమ్మరంగా వాహనాల తనిఖీలు 
  •  మహారాష్ట్ర అధికారులతో సమన్వయం 
  •  మద్యం, నగదు రవాణాపై నిఘా

ఆదిలాబాద్, వెలుగు: మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యుల్ విడుదలవడంతో ఆ రెండు రాష్ట్రాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలువైపులా మహారాష్ట్రతో సరిహద్దులుండడంతో రాకపోకలు, రవాణాపై ఇక్కడి పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నగదు, మద్యం, మత్తుపదార్థాల రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మహారాష్ట్ర పోలీసుల సమన్వయంతో ఇటు జిల్లా సరిహద్దులు, అటు మహారాష్ట్ర ప్రాంత సరిహద్దుల్లో చెక్  పోస్టులు ఏర్పాటు చేశారు. 

మహా బార్డర్​లో నిఘా..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో చంద్రాపూర్, నాందేడ్, యావత్మాల్, గడ్చిరోలి జిల్లాలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అక్కడి అధికారులు ఆదిలాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో మన జిల్లా సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని శంకర్ గూడ, జైనథ్ మండలంలోని ఆనంద్ పూర్, పిప్పర్​వాడ, బోథ్ ఘన్ పూర్, తలమడుగు మండలం లక్ష్మీపూర్, భీంపూర్ కరంజీ, గాధీగూడ మండలం మేడిగూడ ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.

ప్రతి చెక్ పోస్ట్ లో ఒక ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లతో 24 గంటలు నిఘా ఉంచారు. నిర్మల్ జిల్లాలోని ముథోల్, బాసర, కుంటాల, సారంగాపూర్, కుభీర్ మండలాలు, కుమ్రం భీం జిల్లాలోని బెజ్జూర్, కౌటాల, చింతలమానేపల్లి, మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి, చెన్నూర్, వేమనపల్లి మండలాలు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. 

రెండు రాష్ట్రాల పోలీసుల సమన్వయం..

ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు సమన్వయంతో ముందుకెళ్తున్నారు. ఇటీవల చంద్రాపూర్​లో మహారాష్ట్ర అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆదిలాబాద్ పోలీసు అధికారులు పాల్గొన్నారు. మంగళవారం యావత్ మాల్ జిల్లాలో సమావేశం నిర్వహించగా ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం పాల్గొని ఇక్కడి పరిస్థితులపై మాట్లాడారు. జిల్లా సరిహద్దులోంచి మహారాష్ట్రలోకి ఎలాంటి అక్రమ రవాణాను నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆదిలాబాద్ జిల్లా మీదుగా గంజాయి రవాణా జరుగుతుండగా అరికట్టడంపై చర్చించారు.

బార్డర్​లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మద్యం, నగదు, మత్తు పదార్థాలు, ఓటర్లను ప్రలోభపెట్టే బహుమతులు సరఫరా చేసే అవకాశాలుండడంతో అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

నిఘా కట్టుదిట్టం చేశాం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా కట్టుదిట్టం చేశాం. ఎలాంటి మద్యం, నగదు, మత్తు పదార్థాలను అక్రమ రవాణా జరుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. 24 గంటల పాటు పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
– గౌస్ ఆలం, జిల్లా ఎస్పీ ఆదిలాబాద్