- జలసౌధలో సోదాలు.. రిజర్వాయర్ వివరాలపై ఆరా
- స్టాండింగ్ కమిటీ, హైపవర్ కమిటీ మీటింగ్ మినిట్స్ ఇవ్వాలని ఆదేశం
- 2008 నుంచి ఇప్పటిదాకా ఏజీ, కాగ్ రిపోర్టులు ఇవ్వాలన్న విజిలెన్స్
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించి ఇప్పటికే విచారణ జరుపుతున్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌పైనా ఫోకస్ పెట్టింది. సోమవారం ఆ శాఖ అధికారులు జలసౌధలో సోదాలు నిర్వహించి.. రిజర్వాయర్‌కు సంబంధించిన పలు రికార్డులను ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజీ 13 నుంచి 5 వేల క్యూసెక్కుల నీటిని కొండపోచమ్మ సాగర్‌కు తరలించేలా ప్యాకేజీ 14లో భాగంగా చేపట్టిన కన్వేయర్ సిస్టమ్‌లోని గ్రావిటీ కెనాల్ తవ్వకం, రెండు దశల పంపింగ్ వివరాల గురించి అధికారులు ఆరా తీసినట్టు తెలిసింది.
అలాగే, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ రిజర్వాయర్‌కు సంబంధించిన పలు రికార్డుల గురించి అధికారులను అడిగినట్టు తెలిసింది. 2008 నుంచి ఇప్పటివరకు ఏజీ, కాగ్ రిపోర్టులు, రిజర్వాయర్ నిర్మాణ పనులకు సంబంధించి కాగ్ హైపవర్ కమిటీలో తీసుకున్న నిర్ణయాల రికార్డ్స్, సైట్ ఇన్‌స్పెక్షన్ వివరాలు.. ఆ రిపోర్టులు, స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ, ఐబీఎం కమిటీ రివ్యూ మీటింగ్ మినిట్స్, అంచనా వ్యయాలకు అనుమతులు.. ప్రభుత్వ ఆమోదాలు, వాటికి సంబంధించిన పత్రాలు, ఇంకా ఏవైనా డాక్యుమెంట్స్ ఉంటే వాటిని కూడా అర్జెంట్‌గా పంపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఆ వివరాలను మంగళవారం విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌కు ఇరిగేషన్ అధికారులు అందించనున్నారు. వాస్తవానికి గత నెల 24నే విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ జలసౌధలో సోదాలు నిర్వహించాల్సి ఉన్నా.. ఏఈఈలకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ లెటర్లు పంపిణీ చేసే కార్యక్రమం ఉండడంతో వాయిదా పడింది.
మూడేండ్లు ఎందుకు పట్టించుకోలే?
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయ్యాక మూడేండ్లపాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌ను ఎందుకు పట్టించుకోలేదని ఈఎన్‌సీ ఓ అండ్ ఎం నాగేందర్ రావును విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ ప్రశ్నించింది. సోమవారం ఆయన విజిలెన్స్ విచారణకు హాజరయ్యారు. 2019 జూన్‌లో బ్యారేజీ ప్రారంభమయ్యాక 2021 దాకా డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఉంటుందని, ఆపై ఐదేండ్లపాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చూసే బాధ్యత నిర్మాణ సంస్థదేనని ఈఎన్‌సీ నాగేందర్ రావు బదులిచ్చినట్టు తెలిసింది. తొలిసారి బ్యారేజీలో లోపాలు వచ్చినప్పుడు ఏం చేశారు? పటిష్ట చర్యలు ఎందుకు చేపట్టలేదు? నిర్మాణ సంస్థ పట్టించుకోకపోతే వారిని ఎందుకు సమన్ చేయలే? అని ఆయన్ను విజిలెన్స్ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. బ్యారేజీ ఆపరేషనల్ ప్రొటోకాల్స్ ఎందుకు ప్రిపేర్ చెయ్యలేదని ప్రశ్నించిందని సమాచారం. బ్యారేజీ కట్టినప్పటి నుంచి ఇప్పటివరకు తెలిసిన లోపాల రిపోర్టులు, రికార్డులు ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిసింది. కాగా, విచారణలో భాగంగా.. మంగళవారం సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) మాజీ చీఫ్ ఇంజినీర్ (సీఈ) టి. శ్రీనివాస్, డైరెక్టర్ వర్క్ అకౌం ట్స్ డైరెక్టర్ వి.ఫణిభూషణ్ శర్మ నుంచి విజిలెన్స్ వివరాలు కోరనుంది.