వరంగల్‌ హెల్త్‌ సిటీపై విచారణ షురూ!

వరంగల్‌ హెల్త్‌ సిటీపై విచారణ షురూ!
  • సీఎం రేవంత్‌ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
  • హాస్పిటల్‌ను సందర్శించిన విజిలెన్స్‌ అధికారులు 
  • ఆర్​అండ్​బీ ఆఫీసర్లతో కలిసి ఎంక్వైరీ

హనుమకొండ, వెలుగు : వరంగల్ హెల్త్ సిటీపై విజిలెన్స్ అండ్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ అధికారులు విచారణ ప్రారంభించారు. రూ.1,100 కోట్లతో చేపట్టిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ వ్యయాన్ని గత ప్రభుత్వం ఎలాంటి అనుమతుల్లేకుండా రూ.1,725.95 కోట్లకు పెంచడంపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సీరియస్‌‌గా తీసుకుంది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్‌‌ ఇటీవల విజిలెన్స్ అండ్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డీజీ సీవీ ఆనంద్‌‌ను విచారణకు ఆదేశించగా.. ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. 

ఎలాంటి పర్మిషన్లు లేకుండా రూ.625.95 కోట్లు అంచనా వ్యయం పెరగడంపై వరంగల్ విజిలెన్స్ ఆఫీసర్ ఏఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఆసుపత్రి నిర్మాణం ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో చేపట్టగా, శుక్రవారం ఉదయం ఆర్ అండ్ బీ ఎస్ఈ ఆఫీస్‌‌ను విజిట్ చేశారు. అక్కడ సూపర్ స్పెషాలిటీ హస్పిటల్ నిర్మాణానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు ఆర్ అండ్ బీ ఆఫీసర్లతో కలిసి నిర్మాణంలో 

ఉన్న హాస్పిటల్ పనులను జాయింట్ ఇన్‌‌స్పెక్షన్ చేశారు. అక్కడ సివిల్ వర్క్స్‌‌తో పాటు అన్ని రకాల వసతులపై ఆరా తీశారు. ముఖ్యంగా సిరామిక్ టైల్స్ కొనుగోలుకే దాదాపు రూ.వంద కోట్ల వరకు కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో దాదాపు గంటన్నర సేపు హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించి, పలు వివరాలు నమోదు చేసుకున్నారు. 

ఆర్ అండ్ బీ రికార్డులు స్వాధీనం..

ఎంక్వైరీలో భాగంగా అధికారులు శుక్రవారం ఉదయం 10.30కు ఆర్ అండ్ బీ ఆఫీస్‌‌లో విచారణ ప్రారంభించారు. హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించిన పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించిన అంచనాలు, నిర్మాణ వ్యయం పెంచడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. బడ్జెట్ పెంపునకు సంబంధించి ఏమైనా సర్క్యులర్లు, జీవోలు ఇచ్చారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. 

ALSO READ : ముంపు భూముల్లో అక్రమ షెడ్లపై ఎంక్వైరీ చేయట్లే

విజిలెన్స్ విచారణలో మొదటి రోజు విజిలెన్స్ ఇంజినీరింగ్ వింగ్ ఆధ్వర్యంలో స్క్రూటీని చేస్తుండగా, హాస్పిటల్‌‌ బడ్జెట్ పెంచడంపై ఆర్ అండ్ బీ అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలిసింది. పూర్తి విచారణ అనంతరం రిపోర్టును ప్రభుత్వానికి అందజేస్తామని అధికారులు తెలిపారు.