సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని పౌరసరఫరాల శాఖ మండల్ లెవెల్ స్టాక్ పాయింట్(ఎంఎల్ఎస్) గోదాంలో మంగళవారం రాష్ట్ర స్థాయి ఎన్ ఫోర్స్ మెంట్, టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గోదాంలో దించకుండానే రెండు లారీల బియ్యం మాయం అయినట్టు టాస్క్ ఫోర్స్ సోదాల్లో వెల్లడయింది. పౌర సరఫరాల శాఖ కమిషనరేట్ ఎన్ ఫోర్స్ మెంట్, టాస్క్ ఫోర్స్ టీం ఆఫీసర్, అడిషనల్ ఎస్పీ ప్రభాకర్, టీం సభ్యుడు, ఎఫ్ సీఐ మేనేజర్ లక్ష్మారెడ్డితో కలిసి మీడియాకు వివరాలను వెల్లడించారు.
సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల స్టేజ్ వన్ గోదాం నుంచి పౌర సరఫరాల శాఖ ఇక్కడి ఎంఎల్ఎస్ పాయింట్‌కు సోమవారం ఐదు లారీల బియ్యాన్ని పంపించింది. ఇందులో 420 బస్తాల చొప్పున ఉన్న మూడు లారీలు మాత్రమే గోదాంకు చేరాయి. వీటిని పలు రేషన్ షాప్‌లకు పంపిణీ చేశారు. 450 బస్తాలున్న ఒక లారీ, 495 బస్తాలున్న మరో లారీ గోదాంకు చేరకుండానే మాయం అయ్యాయి. అధికారులు పక్కా సమాచారంతో గోదాంపై దాడులు చేశారు. లారీలు ఎటు వెళ్లాయి అనేది విచారణ జరుగుతున్నట్టు టీం ఆఫీసర్ ప్రభాకర్ తెలిపారు. ఒక రైస్ మిల్లులో ఈ బియ్యాన్ని అన్లోడ్ చేసినట్టు అనుమానించి అధికారులు సోదాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. సంబంధిత లారీ డ్రైవర్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. గోదాంలో పనిచేసే ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కూడా అందుబాటులో లేకుండాపోవడం గురించి టాస్క్ ఫోర్స్ బృందం ఆరా తీస్తోంది. అయితే ఈ రెండు లారీలలోఉన్న 452 క్వింటాళ్ల బియ్యాన్ని గోదాంలో అన్లోడ్ చేసుకున్నట్టు సంబంధిత అధికారి పేపర్లపై ధ్రువీకరించాడు. పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ కు చెందిన మరో టీం తహసీల్దార్ దినేశ్, సీఐ లు వరుణ్ ప్రసాద్, అనిల్ కుమార్, ఎస్సై నారాయణ బాబు తదితరులు కూడా గోదాంలో సోదాలు నిర్వహించారు.